రౌండ్‌ ద క్లాక్‌ ‘డయాలసిస్‌’ | - | Sakshi
Sakshi News home page

రౌండ్‌ ద క్లాక్‌ ‘డయాలసిస్‌’

Mar 26 2025 12:44 AM | Updated on Mar 26 2025 12:42 AM

కరీంనగర్‌ జీజీహెచ్‌లో మెరుగైన వైద్యం

పాజిటివ్‌ కేసులకు

రెండు ప్రత్యేక యూనిట్లు

ప్రస్తుతం 10యూనిట్లతో

65 మందికి డయాలసిస్‌

24 / 7 సేవలు..

మరో 10 మందికి అవకాశం

కరీంనగర్‌టౌన్‌: ఉమ్మడి జిల్లాలో మూత్ర పిండాల బాధితులు ఏటా పెరుగుతున్నారు. మధుమేహం, పొగ, మద్యం అధికంగా తాగడం, ఫ్లోరైడ్‌ నీరు, ఆహార నియమాలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మూత్ర పిండాల సమస్యలను సకాలంలో గుర్తించకపోవడంతో డయాలసిస్‌ వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాళ్లు, ఇన్‌ఫెక్షన్లను ముందే గుర్తిస్తే నెఫ్రాలజిస్టులు అందించే చికిత్సలతో బాధితులు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు పాడై డయాలసిస్‌ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడేవారికి కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డయాలసిస్‌ సెంటర్‌ వరంగా మారింది. తెల్లకార్డు ఉంటే చాలు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్నారు.

10 యూనిట్లతో సెంటర్‌

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఆవరణలో డయాలసిస్‌ సెంటర్‌ను 10 యూనిట్లతో ప్రారంభించారు. ఇందులో 8 సాధారణ డయాలసిస్‌ యూనిట్లు కాగా పాజిటివ్‌ పేషెంట్ల కోసం ఒకటి హెచ్‌సీవీ, మరొకటి హెచ్‌బీఎస్‌ఏజీ యూనిట్లను నెలకొల్పారు. 2018 జూన్‌ 8నుంచి డయాలసిస్‌ సేవలు మొదలయ్యాయి. సెంటర్‌ ప్రారంభించిన నాటి నుంచి వేల మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 65 మందికి సేవలు అందిస్తుండగా మరో 10 మందికి సేవలు అందించేందుకు సెంటర్‌ సిద్ధంగా ఉంది.

ప్రభుత్వాసుపత్రిలోనే సురక్షితం

ప్రభుత్వాసుపత్రి డయాలసిస్‌ సెంటర్‌లో కిడ్నీ బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. డయాలసిస్‌లో వినియోగించే డయాలైజర్‌ అనే పరికరం అత్యంత ప్రధానమైనది. ఈ పరికరాన్ని ప్రైవేటు సెంటర్లలో నాలుగైదు సార్లు వాడుతారు. కానీ ప్రభుత్వ సెంటర్‌లో ఒక పేషెంట్‌కు ఒకసారి మాత్రమే వినియోగిస్తారు. దీంతో పేషెంట్లు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది.

ఇబ్బందుల్లేకుండా సేవలు

కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎంత మంది డయాలసిస్‌ కోసం వచ్చినా.. సేవలు అందిస్తున్నాం. సరిపడా టెక్నీషియన్లు, వసతులు కల్పిస్తున్నాం. ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చర్యలు చేపడుతున్నాం. రెండు యూనిట్లు హెచ్‌సీవీ, హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్‌ పేషెంట్ల కోసం నిర్వహిస్తున్నాం. మరో పది మందికి ఇక్కడ డయాలసిస్‌ చేయించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా దరకాస్తు చేసుకుంటే సేవలందిస్తాం.

– వి.అజయ్‌కుమార్‌, డయాలసిస్‌ ఇన్‌చార్జి

రౌండ్‌ ద క్లాక్‌ ‘డయాలసిస్‌’1
1/1

రౌండ్‌ ద క్లాక్‌ ‘డయాలసిస్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement