సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థల 39వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్‌ఈ పాఠశాల ఆవరణలో అట్టహాసంగా జరిగాయి. తేజస్– 2025 పేరిట నిర్వహించిన వేడుకలను శాతవాహన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 39 ఏళ్లుగా మానేరు విద్యాసంస్థలు దిగ్విజయంగా నడుస్తుండడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి పాఠశాల, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ, 1986లో కరీంనగర్‌లో 80 మంది విద్యార్థులతో ప్రారంభమైన విద్యాసంస్థలు నేడు ఎన్నో వేల మందికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేలా రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలలో చదివిన చాలా మంది నేడు ఉన్నతస్థానాలకు ఎదిగారని వివరించారు. అనంతరం మానేర్ క్యాట్ 2025 పరీక్షలో టాప్ టెన్‌లో నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డి, కడారి సునీతారెడ్డి, మాజీ కార్పొరేటర్‌లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
అట్టహాసంగా ‘మానేరు’ వార్షికోత్సవం