● వీడ్కోలు సభలో కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవలందించడం అదృష్టంగా భావించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్ శిక్షణ పూర్తిచేసుకొని హైదరాబాద్ వెళ్తున్నందున జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు కలిగిన జిల్లాలో శిక్షణ పొందడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.
‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ
సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాకేంద్రంలోని పలు పదోతరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముకరంపురలోని ప్రభుత్వ పురాతన పాఠశాల, వాణినికేతన్ పాఠశాల, మంకమ్మతోటలోని ధన్గర్‌వాడీ పాఠశాలల్లో పరీక్షల తీరును పరిశీలించారు. అక్కడ కల్పించిన సదుపాయాలు పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ప్రతీ నీటిచుక్కను ఒడిసిపట్టాలి
తిమ్మాపూర్: ప్రతీవర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీకాలనీలోని మిషన్ భగీరథ కార్యాలయలో శనివారం నిర్వహించిన ‘ప్రపంచ నీటి దినోత్సవం’ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన, విలువైన తాగునీరు సరఫరా చేస్తున్నామని, ఈ నీటిని వృథా చేయొద్దన్నారు. వేసవి దృష్ట్యా అసిస్టెంట్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.