● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: పదో తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకో వాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. ఉ ట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో గల పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఆయా విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వరాదన్నారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని సూచించారు. ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2, గ్రాండ్ టెస్ట్, ప్రీఫైనల్ పరీక్షల ఆధారంగా ఫలితాలను సమీక్షించారు. డీ, ఈ గ్రేడ్లలో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇందులో డీడీలు రమాదేవి, అంబాజీ, ఆర్‌సీవో ఆగస్టిన్, నాలుగు జిల్లాల ఏటీడీవోలు, ఏపీఎంలు, జీసీడీలు పాల్గొన్నారు.