
పంట పెట్టుబడికి నిరీక్షణ
● ‘పీఎం కిసాన్ నిధి’ కింద
ఏటా రూ.6 వేలు ఇస్తున్న కేంద్రం
● ఐదేళ్లుగా కొత్త రైతులకు అందట్లే..
● వ్యవసాయాధికారి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
● కరీంనగర్ మండలంలో పరిస్థితి
కరీంనగర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించింది. ఐదెకరాలలోపు ఉన్న భూమి ఉన్న రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, ప్రభుత్వ నిబంధనతో కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందని ద్రాక్షగా మారింది. 2019 ఫిబ్రవరి 1 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించడమే ఇందుకు కారణం. 2019 తర్వాత భూములు కొనుగోలు చేసి, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు సమ్మాన్ నిధికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెట్టుబడి సాయం మంజూరవడం లేదు. పలువురు రైతులు వ్యవసాయాధికారి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
656 మందికి రావట్లే..
కరీంనగర్ మండలంలో మొత్తం 5,250 మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనం పొందుతున్నారు. మొదటి విడతలో 6,322 మందికి సాయం అందింది. తర్వాత కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా ఆ సంఖ్య 5,250 మందికి తగ్గింది. అయితే, పలువురు రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో సాయానికి నోచులేకపోతున్నారు. ఆధార్ నంబర్‌కు మొబైల్ నంబర్ లింకేజీ చేయకపోవడం, పీఎం కిసాన్‌కు ఒకటి కంటే ఎక్కువ ఫోన్ నంబర్లు లింక్ చేయడం, రద్దు చేసిన బ్యాంకు ఖాతాలను తొలగించకపోవడం, బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ లేకపోవడం, ఈ–కేవైసీ చేసుకోకపోవడంతో పెట్టుబడి సాయానికి దూరమవుతున్నారు. ప్రస్తుతం 656 మంది రైతులకు పలు కారణాలతో పెట్టుబడి అందడం లేదు.
గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో కొత్త రైతుల వివరాలను నమోదు చేసేందుకు గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు. 2019 కంటే ముందు పట్టాదారులైన రైతులకు మాత్రమే డబ్బులు మంజూరవుతున్నాయి. విరాసత్ పొందినవారికి అవకాశముంది. కటాఫ్ తేదీ తొలగిస్తే కొత్త రైతులకు లబ్ధి చేకూరుతుంది.
– బి.సత్యం,
మండల వ్యవసాయాధికారి, కరీంనగర్