ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలి..
అందుబాటులో మందులు..
● వర్షాకాలంలో తరచూ
తారసపడుతున్న సర్పాలు
● కాటువేస్తే బాధితులను ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటున్న వైద్యులు
ఎల్లారెడ్డి/ఆర్మూర్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం పెరుగుతోంది. వర్షాలు పడ్డప్పుడు వాన నీళ్లతో అవి నివాసముండే పుట్టలు, బొరియలు నిండిపోవడంతో అవి బయటకు వస్తాయి. పొడి, వెచ్చని ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి. అందువల్ల ఇవి నివాస ప్రాంతాలు, పొదలు, ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. పొలాలు, గడ్డి కుప్పలు, చెరువుల వద్ద, ఇళ్ల సమీపంలోని పొదల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాము కాటు ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
నాటువైద్యం వద్దు..
గ్రామీణ ప్రజలు పాము కరిస్తే మంత్రం వేసే వారి వద్దకు పరుగులు తీస్తుంటారు. కొందరైతే మంత్రగాడి పేరు తలచుకుని పాము కరిచిన చోట గట్టిగా కట్టు కడుతుంటారు. ఇలా మూఢ నమ్మకాలను నమ్మి ప్రాణాలను కోల్పోవద్దని పాము కరిస్తే తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు అంటున్నారు. ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రి పరిధిలో గత మార్చి 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు 68 పాముకాటు కేసులు వచ్చాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
పాము కరిస్తే..
● పాము కరిచిన చోట తీవ్రమైన వాపు, నొప్పి ఉంటుంది.
● మాట తడబడటంతోపాటు మత్తు రావడం, కళ్లు భారంగా అనిపించడం.
● శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
● ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం
చేయకూడనివి..
● పాము కాటు వేసిన చోట కోయడం లేదా గాయం చేయడం
● పాము కరిచిన చోట నోటితో విషం పీల్చే ప్రయత్నం చేయడం
● పాము కరిచిన చోటుకు కొద్దిగా పైన గట్టిగా తాడుతో కట్టడం
● మంత్రాలు, మూఢ నమ్మకాలపై ఆధారపడటం
● తెలిసిన మందులు ఇవ్వడం, మద్యం తాగించడం
చేయాల్సినవి..
● బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. గాభరా పెట్టవద్దు
● కాటు వేసిన అవయవాన్ని ఎక్కువగా కదలకుండా చూడాలి
● కాటు వేసిన అవయవంపై ఉంగరాలు, గాజులు, గడియారాలు ఉంటే తీసివేయాలి
● చికిత్స నిమిత్తం తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.
రైతులు జాగ్రత్త..
ప్రజలు ముఖ్యంగా రైతులు పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాము కాట్లకు ఎక్కువగా పొలాల్లో తిరిగే రైతులే బలవుతుంటారు. పాము కాటు బారిన పడకుండా రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు బూట్లు ధరించాలి. రాత్రి వేళల్లో టార్చ్‌లైట్ ఉపయోగించాలి. గడ్డి కుప్పలు, రాళ్ల కింద చేతులు పెట్టే ముందు జాగ్రత్త వహించాలి. పరిసరాల్లో చెత్త, ఎలుకల నివాసాలు లేకుండా చూడాలి.
పాము కాటు, తేలు కాటు కేసుల్లో మొదటి 30 నిమిషాలు చాలా కీలకం. చాలా మంది భయంతో పరుగెత్తుతారు, ఇలా చేయవద్దు. రైతులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి. స్వీయ వైద్యం ప్రాణాలకు ప్రమాదం. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి. ప్రథమ చికిత్సపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.
–డాక్టర్ అమృత్‌రామ్‌రెడ్డి,ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్మూర్
పాము కరిస్తే సొంత వైద్యాలు చేస్తూ, మంత్రాలు వేయిస్తూ సమయం వృథా చేయవద్దు. బాధితులను తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. గత సంవత్సరం ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రిలో 68 పాముకాటుకు గురైన వ్యక్తులకు చికిత్స చేసి ప్రాణాలు రక్షించాం. ఆస్పత్రిలో పాము కాటు చికిత్సకు సరిపడ మందులు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ రవీంద్రమోహన్,
సూపరింటెండెంట్, ఎల్లారెడ్డి ఆస్పత్రి


