పార్టీ బలోపేతానికి
చర్యలు తీసుకోవాలి
భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన పొట్టిగాని శంకర్కు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియామక పత్రాన్ని గాంధీభవన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని సూచించారు.
అడ్డుగా వేసిన షెడ్లను తొలగించాలి
భిక్కనూరు: మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న గంగమ్మ ఆలయం, మడివేలు పోచయ్య ఆలయాల ఎదుట కొందరు అక్రమంగా వేసిన షెడ్డులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణ గంగపుత్ర సంఘం, రజక సంఘ సభ్యులు ఆందోళన చేపట్టారు. అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్డులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, ఎస్సై ఆంజనేయులు, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డిలకు వేరువేరుగా వినతి పత్రాలు సమర్పించారు. గంగపుత్ర సంఘ అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి అంజనేయులు, కోశాధికారి సత్యనారాయణ, రజక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ ముందస్తు అరెస్ట్
భిక్కనూరు: బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ తున్కి వేణును సోమవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వేణు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతాభావం నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు.
మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం
మద్నూర్(జుక్కల్): సుల్తాన్‌పేట్‌లో సోమవారం వార్డు సభ్యుల సమక్షంలో గ్రామంలో మద్యం విక్రయించరాదని తీర్మానం చేసినట్లు గ్రామ సర్పంచ్ రాజేశ్వర్‌గౌడ్ పేర్కొన్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం చేస్తున్నట్లు ప్రకటించి తీర్మాన ప్రతులను ఎకై ్సజ్ పోలీసులతో పాటు స్థానిక ఎస్సై మోహన్‌రెడ్డికి అందించామన్నారు. ఉప సర్పంచ్ బాల్‌రాజ్ ఉన్నారు.
అగ్నివీర్‌కు 8 మంది ఎంపిక
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు అగ్నివీర్ ఎంపికల్లో సత్తా చాటి ఏకంగా 8 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులు కార్తీక్, దత్తాద్రి, సంగమేశ్వర్, సందీప్, సతీష్, జ్ఞానేశ్వర్, శంకర్, జైపాల్‌లను ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, ఎన్‌సీసీ అధికారి సుధాకర్, పీడీ శ్రీనివాస్‌ు, ఆయా విభాగాల అధిపతులు అభినందించారు.
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
కామారెడ్డి అర్బన్: విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఒరిజనల్ సర్టిఫికెట్లను కళాశాలల నుంచి పొందలేక ఇబ్బందులు పడుతున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకుడు బాలు తెలిపారు. ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదని ఆరోపించారు. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమౌతారని హెచ్చరించారు.
శాంతి భద్రతలకు సహకరించాలి
భిక్కనూరు: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని భిక్కనూ ర్ సీఐ నరేష్ కోరారు. సోమవా రం కంచర్ల గ్రామ ప్రజాపతినిధులు, నేతలు ఆయన ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సర్పంచ్ అరుణ స్వామి, మాజీ సర్పంచ్ చంద్రం, నాయకులు శేఖర్ రెడ్డి, బాపురెడ్డి, అనిల్ రెడ్డి ఉన్నారు.


