● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
రామారెడ్డి (ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాల్లో గుడిసెలు లేని ప్రాంతాలుగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం మండల కేంద్రంతో పాటు గిద్ద గ్రామంలో కొత్తగా నిర్మించుకుని గృహప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆయన వ్యక్తిగతంగా కానుకలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గానికి అదనంగా మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. రామారెడ్డి గ్రామానికి వీలైనన్ని ఎక్కువ ఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులు సొంతంగా తెచ్చుకుంటున్న ఇసుక, మొరం రవాణాకు రామారెడ్డి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తహసీల్దార్ ఉమాలత, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీవో తిరుపతి రెడ్డి, రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన, రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.


