● సతమతమవుతున్న నాయకులు
● ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా
పట్టించుకోవడం లేదని ఆవేదన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకే నాయకులు, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు ఇస్తామని ప్రతి పార్టీ చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో తమకు అంతగా ప్రాధాన్యత కాదు కదా, కనీసం గుర్తింపు కూ డా లేకుండా పోతోందని పలువురు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు కుమి లిపోతున్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు దక్కడంలేదని ఆవేదన చెందుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తున్నప్పటికీ చివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ టిక్కెట్‌కు కూడా నోచుకోవడం లేదంటున్నారు. ఇక సర్పంచ్‌లైతే పా ర్టీలు తమను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జవాబుదారీగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తుంటే తమకు అందుతున్న సహకారం అంతంతమాత్రమేనని వాపోతున్నారు. కీలక నాయకులు పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం తమతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు.
పారాచూట్ నాయకులకు పెద్దపీట
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనివారికి పారాచూట్ మాదిరిగా రాగానే ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇ స్తూ.. ఏళ్లతరబడి పనిచేస్తున్న తమకు కనీసం గుర్తింపు ఇవ్వకపోవడమేమిటని ఆయా పార్టీల్లోని సీనియర్లు గుర్రు గా ఉన్నారు. కేవలం డబ్బులే ప్రామాణికంగా చూసుకున్నప్పటికీ, అప్పటికప్పుడు వచ్చి టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్లతో పోలిస్తే, ఏళ్లతరబడి క్షేత్రస్థాయిలో కార్యక్రమాల కోసం తాము ఖర్చు పెట్టడంతోపాటు పార్టీకి, జనానికి అందించిన సేవలు వెలకట్టలేనివని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులుగా రిటైర్ అయినవారికి, వ్యాపారాలు చేసుకుని వచ్చినవారికి అప్పటికప్పుడు టిక్కెట్లు ఇవ్వడమేమిటని పలు పార్టీల సీనియర్ నా యకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇ లా వచ్చినవారిలో జిల్లాలో ఒకరిద్దరు గెలిచినప్పటికీ తరువాత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారని అంటున్నారు. పసుపు నేలగా పేరొందిన ఈ ప్రాంతంలో గెలిచిన ఓ ఎమ్మె ల్యే అయితే ఒక జాతీయ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకపోగా, మరో జా తీయ పార్టీతో అంటకాగుతున్నారనే విమర్శలు ఉ న్నాయి. ఈ విషయమై రెండు జాతీయ పార్టీల కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. సదరు ఎమ్మెల్యే తన సొంత గ్రామంలోనూ సర్పంచ్‌ను గెలిపించుకోలేక చతికిలపడడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
అధికార పార్టీలో ఉండీ..
ఇక అధికార కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి మరోరకంగా ఉంది. అధికారంలో లేని సమయంలో అనేక ఇబ్బందులు పడడంతోపాటు డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని, తీరా అధికారంలోకి వచ్చాక మా త్రం తగిన గుర్తింపు దక్కకపోగా, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. నామిటేటెడ్ పదవుల్లోనూ సీనియర్లమైన తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, మరోవైపు తమ తమ ప్రాంతల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన చిన్న చిన్న పనులు సైతం చేయించలేని దుస్థితిలో ఉన్నామని పలువురు సీనియర్ నాయకులు తమ సన్నిహితుల వద్ద కుమిలిపోతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుని, ఓడిపోవడంతోపాటు తమకు పార్టీ పదవులు కూడా దక్కకుండా చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు.


