● ప్రజలు చైతన్యవంతులైతేనే
పొలాలకు సాగునీరు
● జలసాధన సమితి సమావేశంలో వక్తలు
కామారెడ్డి అర్బన్: మాజీ సీఎం కేసీఆర్ స్వార్థానికి ప్రాణహిత –చేవెళ్ల పథకం బలైపోయిందని బీజేపీ నాయకుడు, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం రీడిజైన్‌తో కామారెడ్డి జిల్లాకు సాగునీరు సంగతి దేవుడెరుగు... తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జలసాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో షబ్బీర్‌అలీ మాట చెల్లుబాటు కావడం లేదన్నారు. ప్రజలు, రైతులు చైతన్యవంతులై పోరాడితేనే ప్రాణహిత 22వ ప్యాకేజీ పనులు పూర్తవుతాయని, ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. జలసాధన పోరాటానికి అవసరమైన సహకారమైనా అందిస్తానన్నారు.
చిత్తశుద్ధి లేకపోతే..
ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ఇంకా రెండు దశాబ్దాలైనా ప్రాణహిత 22వ ప్యాకేజీ పనులు పూర్తి కావని ముఖ్య అతిథులు తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కన్వీనర్ లక్ష్మీనారాయణ, విశ్రాంత నీటిపారుదల శాఖ ఇంజినీర్ గోపాల్ పేర్కొన్నారు. వారు ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై మాట్లాడారు. రాజకీయ వెనకబాటుతోనే కామారెడ్డికి సాగునీరు, ఉపాధి, ఉద్యోగాల్లో అన్యాయం జరుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జలసాధన సమితి మండల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పనుల పూర్తికి అవసరమైన రూ. 2వేల కోట్లను విడుదల చేయాలని, భూసేకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయాలని, ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని తీర్మానించారు. సమావేశంలో జల సాధన సమితి జిల్లా కన్వీనర్ వెంకటరాంరెడ్డి, తెలంగాణ ఐక్యవేదిక నాయకుడు హన్మాండ్లు, న్యాయవాది జగన్నాథం, కాలమిస్ట్ వేణుగోపాల్, నాయకులు శ్రీనివాస్, తోట గంగయ్య, శంకర్, అంజయ్య, రాజేశ్వర్, పీవీఎస్‌ఎన్ రాజు, చంద్రశేఖర్, సిద్ధిరాములు, శ్యాంరావు, వెంకటలక్ష్మి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.


