● నీటమునిగి ఇద్దరు
గొర్రెల కాపరుల మృతి
● మృతులు బావ బావమరుదులు
రుద్రూర్: గొర్రెలను కడిగేందుకు మంజీర నది వద్దకు వెళ్లిన ఇద్దరు నీటమునిగి దుర్మరణం పాలైన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్ర సమీపంలోని మంజీర నదిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోతంగల్ గ్రామానికి చెందిన కుర్మ గంగొండ (43) తన గొర్రెలను మేపేందుకు కుమారుడు సంతోష్‌తోపాటు బావ అయిన రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిక్కాల గంగారాం (50)ను వెంటబెట్టుకొని మంజీర నది ప్రాంతానికి వెళ్లాడు. గొర్రెలను కడుగుతున్న సమయంలో చిక్కాల గంగారాం ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు గంగొండ వెంటనే నీటిలోకి దూకి గల్లంతయ్యాడు. దీనిని గమనించిన సంతోష్ గ్రామస్తులకు సమాచారం అందించాడు. స్థానికులు, ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గంగొండకు ఇద్దరు కుమారులు, గంగారామ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు గంగొండ భార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. బావ బావమరుదుల మృతితో రెండు గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.


