బాల సాహిత్య నిలయం | - | Sakshi
Sakshi News home page

బాల సాహిత్య నిలయం

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

నిజామాబాద్‌ రూరల్‌ : బాలల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేది బాల సాహిత్యం. కథలు, కవితలు, గేయాలు రాయిస్తూ సృజనాత్మకతకు అక్షరరూపం కల్పించి సాహితీ లోకానికి పరిచయం చేస్తోంది ఇందూరు బాలసాహిత్య వేదిక. రెండు సంవత్సరాల క్రితం ఉగాది రోజున ప్రారంభమైన ఈ వేదిక జిల్లాలోని అనేకమంది విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తోంది. కవితారచన, కథారచనలు ఇతర సజనాత్మక ప్రక్రియల్లో విద్యార్థులకు అండగా నిలుస్తున్నది. పాఠశాలల్లో కార్యశాల ఏర్పాటు చేసి కవిత రచన, కథా రచనల్లో మెలకువలను పిల్లలకు నేర్పిస్తున్నది. పుస్తకావిష్కరణలను ప్రోత్సహిస్తున్నది. విద్యార్థులు రాసిన రచనలను వివిధ సాహితీ సంస్థల పోటీలకు పంపించి, బహుమతులు సాధించేలా మార్గదర్శనం చేస్తున్నది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 20 పుస్తకాలు విడుదలయ్యాయి. గుండారం, తడపాకల్‌, ఏర్గట్ల, సిరిపూర్‌, నీలా, కులాస్‌పూర్‌, కాలూర్‌, బాచనపల్లి, వడ్డేపల్లి మొదలైన పాఠశాల విద్యార్థుల రచనలను ప్రోత్సహించి వారి ద్వారా పుస్తకాలు తీసుకువచ్చేందుకు బాల సాహిత్య వేదిక అండగా నిలుస్తున్నది. ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదికకు అధ్యక్షుడిగా డాక్టర్‌ కాసర్ల నరేశ్‌ రావు, ప్రధాన కార్యదర్శిగా డి.ప్రవీణ్‌ కుమార్‌ శర్మ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్‌ శారద, డాక్టర్‌ గంట్యాల, చింతల శ్రీనివాస్‌ గుప్త, శ్రీమన్నారాయణ చారి, స్వర్ణ సమత తదితరులు వ్యవహరిస్తున్నారు.

కవితలంటే ఎంతో ఇష్టం....

రెండు సంవత్సరాల నుంచి కవితలు, కథలు రాస్తున్నాను. ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక కవితా, కథా కార్యశాలలో పాల్గొన్నాను. ఇప్పటి వరకు 30 కవితలు, 6 కథలు రాశాను. జాతీయ సైన్స్‌ఫిక్షన్‌ కథా పోటీలో నేను రాసిన ‘బ్రేవ్‌ గర్ల్‌ ‘అనే కథకు బహుమతి లభించింది. నాకు చాలా సంతోషం వేసింది. మా అందరికీ తెలుగు భాషా భిమానాన్ని కలిగించి, ముందుకు తీసుకెళ్తున్న ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదికకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.

– కే. కృతిక, 8వ తరగతి,

జాతీయస్థాయి సైన్స్‌ఫిక్షన్‌ కథా పోటీల విజేత

విద్యార్థుల్లోని సృజనాత్మకతను

వెలికితీస్తున్న బాలసాహిత్య వేదిక

కవితలు, కథలు, గేయాల రచనల్లో రాణిస్తున్న పిల్లలు

ఇప్పటి వరకు 20 పుస్తకాల రచన

Advertisement
 
Advertisement
Advertisement