రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

నవీపేట : మండలంలోని నాగేపూర్‌ గ్రామ శివారులోని బాసర రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన పోసాని(44) నాలుగు నెలలుగా కోస్లీలోని సోదరి జ్యోతి దగ్గర ఉంటుంది. నవీపేటలో పని ఉండడంతో మరిది పోశెట్టితో కలిసి ఆదివారం మధాహ్నం బైక్‌పై వెళ్తుండగా నాగేపూర్‌ సమీపంలో అదుపుతప్పిన బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కిందపడిన పోసాని తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోశెట్టికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలికి భర్త, పిల్లలు లేరు. తల్లిదండ్రులు చనిపోయారు. సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

గాయపడిన యువకుడు ..

రుద్రూర్‌ : ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సాయన్న ఆదివారం తెలిపారు. వర్ని మండలం కోటయ్య క్యాంపునకు చెందిన వడ్డేపల్లి భూమేశ్‌(25) శనివారం సాయంత్రం ట్రాక్టర్‌లో సిమెంట్‌ బస్తాలను తీసుకెళ్తుండగా మండల కేంద్రంలోని జవహర్‌నగర్‌ కాలనీ సమీపంలో ట్రాక్టర్‌ టైరు పంక్చర్‌ కావడంతో వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో భూమేశ్‌ తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్‌లో నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అనుమానాస్పదస్థితిలో ఎలక్ట్రీషియన్‌ ..

భిక్కనూరు : మండల కేంద్రంలో ప్రయివేటు ఎలక్ట్రీషియన్‌ ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బల్యాల సిద్దరాములు (46) ప్రయివేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సిద్దరాములు కనిపించడం లేదు. ఆదివారం ఆయన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా సిద్దరాములు మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement