● ప్రమాదంలో తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు
పిట్లం(జుక్కల్): మండలంలోని పోతిరెడ్డిపల్లి తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకుకి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లితండా సమీపంలోని పిట్లం–బాన్సువాడ రహదారిపై ఆదివారం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ నడుపుతున్న దుర్గేశ్‌కు తీవ్రగాయాలు కాగా, వెనకాల కూర్చున్న తండ్రి దుర్గయ్య(62) అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గేశ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్‌అర్బన్ : ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒకరిపై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలోని నాల్గో టౌన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన సోహైల్ ఖాన్‌కు, అతని బంధువు అయిన జావిద్‌ఖాన్ మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. బక్రీద్ సందర్భంగా సోహైల్‌ఖాన్ తన మేనమామ ఇంటికి వెళ్లగా అక్కడికి వచ్చిన జావిద్ కుమారులు ఫర్హాన్, జియాన్, అక్బర్ దాడి చేశారు. సోహైల్‌ఖాన్ తండ్రి సలీంఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.


