బాన్సువాడ రూరల్: కోర్టు ఖర్చులు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ వలంటీర్ల సేవలు అభినందనీయమని శనివారం బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి అన్నారు.కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా 100కు పైగా భార్యాభర్తలు, సీనియర్ సిటిజన్ కేసులను పరిష్కరించిన వలంటీర్లు ఎర్వాల రామకృష్ణారెడ్డి, అయ్యాల సంతోష్, ఎండీ హైమద్ హుస్సేన్, పుష్పవతి, సాయిబాబా సేవలను ఆయన కొనియాడారు. వలంటీర్లు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలు అందించడం గర్వకారణమన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమన్నారు. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్, వలంటీర్లకు తన వంతు సహకారం అందిస్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు. ప్రజలు చిన్నచిన్న వివాదాలపై కోర్టులను ఆశ్రయించకుండా స్థానికంగా మీడియేషన్ సెంటర్ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.


