● వాట్సాప్ వేదికగా కవితాకార్యశాల
● నవతరం కవులకు మార్గదర్శకం
● కవితారచనపై అవగాహన
● నేడు కవి సమ్మేళనం
నిజామాబాద్ రూరల్ : కవిత్వం ఒక సృజనాత్మక, విలక్షణ పక్రియ. ప్రతి సాహిత్య పక్రియ ప్రత్యేకమైనదే.అలాంటి కవిత్వంపై ఈతరం కవులకు మార్గదర్శనం చేస్తోందీ‘సాహిత్య బడి’సమూహం. సాంకేతికతను అందిపుచ్చుకొని వాట్సాప్ వే దికగా నిత్యం కవితా కార్యశాలను నిర్వహిస్తోంది.
రోజుకో అంశంపై..
ఇందూరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మద్ద కూరి సాయిబాబు, నిర్వాహకులు కాసర్ల నరేశ్‌రావు ప్రారంభించిన ఈ వాట్సాప్ సమూహంలో జిల్లాకు చెందిన 100 మంది కవులు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సమూహసభ్యులకు, ఆ రోజు రాయాల్సిన కవితా అంశాన్ని, ప్రక్రియను సూచిస్తారు. సాయంత్రం 6 గంటలలోపు అందరూ రాయాలి. అలా రాసిన కవితలను రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెద్దలు సమీక్ష చేస్తారు. ఇలా ప్రతిరోజు కొత్త అంశంపై విభిన్న ప్రక్రియలతో ఈ కవితా కార్యశాల కొనసాగుతోంది. సోమవారం పద కవిత, మంగళవారం వర్ణీయ కవిత, బుధవారం వచన కవిత, గురువారం గేయ కవిత, శుక్రవారం చిత్ర కవిత, శనివారం మినీ కవిత, ఆదివారం స్వేచ్ఛా కవితపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతినెల చివరి ఆదివారంలో సభ్యులంతా కలిసి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్యక్రమానికి ప్రముఖ కవులను అతిథులుగా ఆహ్వానించి వారితో కవితారచనలో మెళకువలను వివరిస్తున్నారు. ఉత్తమ కవితలు రాసిన వారిని సన్మానిస్తున్నారు. ఈ నెల 31న సాహిత్య బడి ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించనున్న కవి సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తిక్ నాయక్ అతిథిగా రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
యువ కవుల రచనలను ప్రోత్సహించడం, మెళకువలను నేర్పించడం కోసమే సాహిత్య బడిని ఏర్పాటు చేసుకున్నాం. మద్దుకూరి సాయిబాబు ఆలోచన నుంచి ఆవిర్భవించిన సమూహమిది. రెండు నెలలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇందులో విద్యార్థులు, యువకులు, వర్తమాన కవులు చాలామంది ఉన్నారు.
– డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, కార్యశాల నిర్వాహకులు
మంచి వేదిక..
ఈ తరంలో కవితలు రాస్తున్నవారికి, కవితారచన నేర్చుకోవడానికి మంచి వేదికగా సాహిత్య బడిని ప్రారంభించుకున్నాం. చాలామంది కవులు ఈ వేదిక ద్వారా రోజు కవిత్వం రాస్తున్నారు. వివిధ పత్రికల్లో ఈ సమూహంలోని సభ్యుల కవితలు వస్తున్నాయి. కవితలపై తర్ఫీదునిస్తూ రోజురోజుకూ యువ కవులు రాటుదేలేలా, సాహిత్య బడి పెద్దల పర్యవేక్షణలో నడుస్తున్నది.
– డా.మద్దుకూరి సాయిబాబు, నిర్వహణ కమిటీ సభ్యులు


