తిమ్మాపూర్‌లో వారంతపు సంత ప్రారంభం
బాన్సువాడ: బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో వారంతపు సంతను శనివారం సర్పంచ్ అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల అవసరాలను తెలుసుకుని వారాంతపు సంతను ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామస్తులు కూరగాయల కోసం ప్రతీ మంగళవా రం బీర్కూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, బస్సు సౌకర్యం లేక, ఇబ్బందులు పడుతున్నారని అన్నా రు. ప్రతి శుక్రవారం గ్రామంలో వారాంతపు సంత కొనసాగుతుందని అన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కోరుతూ ధర్మారావ్‌పేట్‌లో శనివారం బడిబాటలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో యోసెఫ్ మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ ఇస్తున్నామన్నారు. ప్రధానోపాధ్యాయుడు సదాశివ, వార్డు సభ్యుడు గౌసొద్దిన్, తదితరులు పాల్గొన్నారు.
అమ్మమాట అంగన్‌వాడీ బాట
నిజాంసాగర్(జుక్కల్): ఐదేళ్ల లోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలె సుగుణమ్మ అన్నారు. శనివారం నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అమ్మమాట– అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీల్లో అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫామ్స్ అందజేశారు. సర్పంచులు ఏలె సుగుణమ్మ, అడ్డగళ్ల శారద, దఫేదార్ బాలమణి తదితరులున్నారు.
మహిళా సమాఖ్య సభ్యుల ర్యాలీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో శనివారం ఐకేపీ ఆద్వర్యంలో మండల మహిళా సమాఖ్య సభ్యులు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు ఉల్లాస్ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేశారు. మహిళల అక్షరాస్యతపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. మహిళలందరూ విద్యావంతులు కావాలని అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐకేపీ ఏపీఎం ప్రసన్న కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
కొలతల ప్రకారం పనిచేయాలి
బాన్సువాడ రూరల్: ఉపాధి హామీ కూలీలు కొలతల ప్రకారం పని చేయాలని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ సూచించారు. శనివారం ఆయన బోర్లం గ్రామ శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలు, క్షేత్రసహాయకులకు పలు సూచనలు చేశారు. మండుతున్న ఎండలు, వడగాలులను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 గంటలకు పనులకు వచ్చి 10 గంటల వరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. కొలత ప్రకారం పనిచేస్తే రోజు కూలి రూ.307 గిట్టుబాటు అవుతుందన్నారు. జీపీ కార్యదర్శి సాయికుమార్ ఉన్నారు.


