ఒకరి దారుణ హత్య
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి(56) రైతు. 15 సంవత్సరాలుగా ఆయనకు గ్రామానికి చెందిన మరో కుటుంబంతో భూతగాదాలున్నాయి. శుక్రవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా రాజిరెడ్డిని కొందరు వ్యక్తులు హత్య చేసి గ్రామ శివారులోని ఓ నీళ్లు లేని పాడుబడిన బావిలో పూడ్చి పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆ బావి వద్ద పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. విషయం బయటకు తెలియడంతో స్థానికులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
రాత్రి 11:30 గంటల ప్రాంతంలో రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భూ తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. విచారణ కొనసాగుతుందని, పూర్తి వివరాలు తొందర్లోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.


