సా..గుతుండగానే మరో విడత | - | Sakshi
Sakshi News home page

సా..గుతుండగానే మరో విడత

May 31 2026 1:48 AM | Updated on May 31 2026 1:48 AM

లక్ష్యం దిశగా అడుగులు..

జూన్‌ 2 నుంచి రెండో విడత

ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం సన్నద్ధం

తొలివిడతలో జిల్లాలో నిర్మాణం

పూర్తయినవి 1604 ఇళ్లు మాత్రమే

జిల్లాలో ఇప్పటివరకు 12,090 ఇళ్లను కేటాయించగా, 11,592 ఇళ్లకు ముందస్తు మంజూరు లభించింది. 10,725 ఇళ్ల పనులను ప్రారంభించారు.1,604 ఇళ్ల పనులు పూర్తికాగా లబ్ధిదారులు గృహప్రవేశాలు పూర్తి చేశారు. మరో 9,121 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉండగా, 867 ఇళ్ల పనులు అసలు ప్రారంభమే కాలేదు. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇళ్లను జూన్‌ 2వ తేదీ నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సామూహిక గృహప్రవేశాలు చేయించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఇప్పటివరకు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 210.57 కోట్ల నిధులను నేరుగా డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) చేసినట్లు హౌసింగ్‌ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి వెల్లడించారు.

కామారెడ్డి టౌన్‌ : పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదటి విడతలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు సా..గుతుండగానే తదుపరి ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో ఇళ్లు దక్కని అర్హులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చే నెల 2వ తేదీ నుంచి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హౌసింగ్‌ శాఖ సమన్వయంతో ప్రభుత్వం ముమ్మర ఏ ర్పాట్లు చేస్తోంది. దీంతో జిల్లాలో మొదటి విడతగా ప్రా రంభించిన పనుల పురోగతిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల అమలులో జిల్లా ప్రస్తుతం 10వ స్థానంలో కొనసాగుతోంది.

నిబంధనలు సడలిస్తేనే పురోగతి!

జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగు దశల్లో ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు నిర్మాణాల వేగాన్ని నియంత్రిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఇంటి నిర్మాణ విస్తీర్ణ పరిమితి (స్క్వేర్‌ ఫీట్‌) నిబంధనలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందికరంగా మారాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పరిమితిని మరింత పెంచి, ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు మార్కెట్‌లో సిమెంట్‌, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో బిల్లుల చెల్లింపుల్లో సాంకేతికంగా ఆలస్యం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది.

రెండో విడత మార్గదర్శకాల్లోనైనా నిబంధనలను కొంత సడలించి, బిల్లులను సకాలంలో క్లియర్‌ చేయాలని క్షేత్రస్థాయిలో విజ్ఞప్తులు వస్తున్నాయి. రెండో విడత అమలుకు సంబంధించి జూన్‌ 2వ తేదీ లోపే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు, స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నుంచి వచ్చే ఆదేశాలు, సూచ నలు, నిబంధనల మేరకు రెండో విడతను కూడా సజావుగా నిర్వహిస్తామని జిల్లా హౌజింగ్‌ అధికారులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement