కామారెడ్డి క్రైం : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ మహిళా వారోత్సవాల్లో భాగంగా స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్‌ను కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. స్నేహ కార్యక్రమం ద్వారా కిశోర, కిశోరీలలో ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, విద్య, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అక్షరాస్యత పరీక్షలు రాసిన మహిళలను కలెక్టర్ సన్మానించారు. జిల్లాలో ఉల్లాస్ ద్వారా 16,331 మంది మహిళలు అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు రాశారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ నరసింహ రెడ్డి, అదనపు కలెక్టర్ గిరి, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, డీపీఎం శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


