కదలని ఇసుక మేటలు | - | Sakshi
Sakshi News home page

కదలని ఇసుక మేటలు

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

కదలని ఇసుక మేటలు రెండు పంటలు కోల్పోయా రూ. 40 వేలు ఖర్చయ్యాయి టార్గెట్‌ మేరకు పనులు..

పరిహారం ఊసేలేదు..

తొలగించింది నాలుగో వంతే..

జిల్లాలో గతేడాది ఆగస్టు చివరి వారంలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వరదలతో పలు చెరువులు, కుంటలు తెగిపోయాయి. దీంతో లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక మేటలు వేశాయి. అలాగే పెద్దవాగు, పాముల వాగుకు భారీ వరద నీరు పోటెత్తడంతో పరీవాహక ప్రాంతాల్లోని పంటలు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అన్నదాతలు భారీగా నష్టపోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది సెప్టెంబర్‌ 4న లింగంపేట మండలంలో పర్యటించి బూరుగిద్ద శివారులోని ఊట చెరువు కింద ఏర్పడిన ఇసుక మేటలను పరిశీలించారు. వెంటనే ఇసుక మేటలు తొలగించి సాగుకు యోగ్యంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఇసుక మేటల కొలతలు వేశారు.

బూరుగిద్దలో పొలంలో ఏర్పడిన ఇసుక మేటలు, పాముల వాగు పరీవాహక ప్రాంతంలో రైతులు సొంతంగా ఇసుక మేటలు తొలగించుకున్న భూమి

చెరువు కింద ఎకరంనర పొలం ఉంది. బూరుగిద్ద శివారులోని సోములనయ చెరువు ఆనకట్ట తెగిపోయి అర ఎకరంలో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. పంట కొట్టుకుపోయి నష్టమైంది. ఇసుక మేటలతో సాగుకు పనికిరాకుండా అయ్యింది. అధికారులు ఇప్పటికీ ఇసుక తొలగించలేదు. చెరువు ఆనకట్ట తెగిపోవడంతో యాసంగిలో పంటలు వేయలేకపోయాం. వానాకాలంలోనూ బీడుగా ఉంచాల్సి వస్తోంది.

– కొప్పుల సాయిలు, రైతు, బూరుగిద్ద

పాముల వాగు పరీవాహక ప్రాంతంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. భారీ వరదల కారణంగా ఎకరంనర పొలంలో రాళ్లు, ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అధికారులు సర్వే చేశారు రెండు రోజులు పనులు చేసి వదిలేశారు. ఇసుక అలాగే ఉండడంతో యాసంగిలో ఎకరంనర భూమిని బీడుగా ఉంచాల్సి వచ్చింది. ఇసుక, రాళ్లు తొలగించడానికి రూ. 40 వేల వరకు ఖర్చయ్యాయి.

– ఆకుల రాములు, రైతు, లింగంపేట

జిల్లాలో గతేడాది వచ్చిన భారీ వరదలతో 288 ఎకరాలలో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అందులో 82 ఎకరాల్లో ఇసుక మేటలు తొలగించాం. మా టార్గెట్‌ పూర్తి కావడంతో మిగతా వాటిలో రైతులే తొలగించుకోవాలని సూచించాం. కొంత మంది రైతులు సొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఇసుక మేటలు తొలగించుకున్నారు.

– నరేందర్‌, ఏపీవో, ఉపాధి హామీ పథకం

వర్షాల కారణంగా లింగంపేట మండలంలో 1,336 మంది రైతులకుగాను సంబంధించిన 1,036 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్‌ వివరించారు. కాగా తొమ్మిది నెలలు గడుస్తున్నా పాలకులు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదు. వరదలతో నష్టపోయామని, పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

మండలంలో 602 మంది రైతులకు సంబంధించిన 288 ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడినట్లు అధికారుల సర్వేలో తేలిందని ఉపాధి హామీ ఏపీవో నరేందర్‌ తెలిపారు. అయితే అధికారులు నిబంధనల సాకుతో నామమాత్రంగా ఇసుక మేటలు తొలగించి టార్గెట్‌ పూర్తయ్యిందంటూ చేతులు దులుపుకున్నారు. 288 ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడగా.. ఉపాధి హామీ పథకంలో 82 ఎకరాల్లో మాత్రమే తొలగించడం గమనార్హం. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన పలువురు రైతులు సొంతంగానే ఇసుక మేటలను తొలగించుకుంటున్నారు. ఇంకా చాలాచోట్ల అలాగే ఉన్నాయి. భారీగా ఇసుక మేటలు పెట్టిన పొలాలను రైతులు బీడుగా ఉంచుతున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశించినా

నామమాత్రంగానే చర్యలు

జిల్లాలో 288 ఎకరాల్లో ఇసుక

మేటలు.. తొలగించింది 82 ఎకరాల్లోనే..

సొంతంగానే

తొలగించుకుంటున్న రైతులు

ఇప్పటికీ సాగుకు యోగ్యంగా

మారని భూములు

అన్నదాతకు అందని

పంట నష్ట పరిహారం

Advertisement
 
Advertisement
Advertisement