కామారెడ్డిటౌన్: జిల్లా కేంద్రంలోని పాత జాతీ య రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్, మురుగు కాల్వపై స్లాబ్‌ల నిర్మాణంపై ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ వివాదాస్పద వెంచర్‌పై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నిబంధనల ఉల్లంఘన నిజమేనని తేల్చారు. అనంతరం మున్సిపల్ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వెంచర్ నిర్వాహకుడికి శుక్రవారం అధికారికంగా నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్ రాళ్లను, రోడ్లను మూడు రోజుల్లోగా స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. లేనిపక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో హెచ్చరించారు.
బిచ్కుంద(జుక్కల్): కోర్డు కేసులలో ఉన్న కక్షిదారులు ఇద్దరూ రాజీపడి లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ సూచించారు. శుక్రవారం కోర్టు ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ ఉందని, అందులో ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయవాదులు మల్లేశ్వర్, మహ్మద్, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
● రాష్ట్రంలో కాషాయ జెండా
ఎగురవేయడమే బీజేపీ లక్ష్యం
● పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్‌పాటిల్
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని, పార్టీ కన్నా దేశం ముఖ్యమనే సిద్ధాంతాన్ని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని, దేశసేవలో ముందు ఉండాలని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి అభయ్ పాటిల్ సూచించారు. నగర శివారులోని బోర్గాం(పి) పద్మావతి గార్డెన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల ప్రశిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. కార్యక్రమానికి అభయపాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడమే ఏకై క మార్గమని స్పష్టం చేశారు. శిక్షణ తరగతులు కేవలం పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే పరిమితం కాదని, కార్యకర్తలలో క్రమశిక్షణను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి ఉద్ధేశించినవని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యమని, ఆ దిశగా క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త అలుపెరగకుండా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్ర ఇన్‌చార్జీని ధన్‌పాల్ ఘనంగా సన్మానించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. బీజేపీ భావజాలాన్ని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రపంచంలో భారత్ గౌరవం పెరిగిందని, మోదీ నేతృత్వంలో అనేక పథకాలు గ్రామస్థాయి వరకు చేరుతున్నాయన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్రవంతిరెడ్డి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, భరత్‌రెడ్డి, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.


