నాగిరెడ్డిపేట: ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎల్లారెడ్డి మా జీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. గోలిలింగాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, తూకం వేసి రైస్‌మిల్లుకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ ధాన్యం తరలింపులో ప్రభు త్వం సరైన చర్యలు చేపట్టకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నార న్నారు. గత ప్రభుత్వ హయాంలో సరిపడా లారీలు అందుబాటులో లేకపోతే ఆర్టీసీ కార్గో బస్సుల్లో ధాన్యం తరలించామన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రెండు రోజులలో సరైన చర్యలు చేపట్టకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సిద్ధయ్య, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌లు వంశీగౌడ్, మహేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


