విచారణ చేపడుతున్నాం
జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చేస్తున్నారు. అంతేకాకుండా వెంచర్‌లోకి వెళ్లడానికి దారి కోసం వరద కాలువపై రెండు స్లాబ్‌లు నిర్మించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై విచారణ జరిపి నోటీసులు ఇవ్వడానికి బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. – కామారెడ్డి టౌన్
పాత జాతీయ రహదారి పక్కన గల కస్తూర్బా ఆస్పత్రి వెనక భాగంలో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుమతుల కోసం మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న కారణంతో అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా కామారెడ్డి పెద్దచెరువు వరద కాలువ పక్కన ఉన్న ఈ వెంచర్‌కు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఇక్కడ 60 ఫీట్ల రోడ్లు లేవని అధికారులు గుర్తించారు.
చెత్త డంప్ చేసి..
అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతదిగా ప్రచారం జరుగుతోన్న ఈ వెంచర్ లోపలికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో పెద్దచెరువు నుంచి బుర్రమత్తడి వైపు వెళ్లే ప్రధాన వరద కాల్వ (బడా మురుగు కాలువ)పై రెండు స్లాబ్‌లను నిర్మించారు. రహదారి పక్కన ఉన్న కల్వర్టు వద్ద మురుగు కాలువ నీరు వెంచర్ వైపు రాకుండా చెత్త డంప్ చేసి, కాలువను మూసివేశారని వెంచర్ నిర్వాహకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాగే ఉంటే రాబోయే వర్షాకాలంలో ఈ కాలువ ప్రవాహం సాగక, నీరంతా వెనక్కి తన్ని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు సమీప ప్రాంతాలు మళ్లీ వరద ముంపునకు గురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు సంబంధించిన ఈ వరద కాలువపై స్లాబ్‌ల అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఓ కౌన్సిలర్ మార్చి 30న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది అక్రమ నిర్మాణమని, అధికారులు చర్యలు తీసుకోకుంటే వెంచర్ వద్ద, స్లాబ్‌ల వద్ద ధర్నా చేస్తానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి మూడు రోజుల క్రితం హెచ్చరించారు. ఈ నిర్మాణంపై జిల్లా ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. మున్సిపాల్ టౌన్ ప్లానింగ్ అధికారులు దీనిపై విచారణ చేపట్టి, నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ఈ వివాదం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వెంచర్‌కు దారి కోసం వరద కాలువపై స్లాబ్ వేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. ఇరిగేషన్ శాఖ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాగా స్లాబ్ విషయమై నిర్వాహకులు కోర్టుకు వెళ్లారని తెలిసింది. వెంచర్ నిబంధనల పరిధిలో లేనందున విచారణ చేపడుతున్నాం. ఇప్పటికై తే అనుమతి ఇవ్వలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేస్తాం.
– వినీత్, టీపీవో, కామారెడ్డి మున్సిపల్
కామారెడ్డిలో నిబంధనలకు
విరుద్ధంగా వెంచర్
చెరువు వరద కాలువపై
స్లాబ్‌ల నిర్మాణం
చర్యలు తీసుకుంటామంటున్న
బల్దియా అధికారులు


