ధాన్యం తడవకుండా కప్పి ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తడవకుండా కప్పి ఉంచాలి

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

ధాన్యం తడవకుండా కప్పి ఉంచాలి

తడిసిన వడ్లను మిల్లులకు తరలించాం

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

మాచారెడ్డి: వర్షాలు కురిసినా వడ్లు తడవకుండా టార్పాలిన్‌ కవర్లతో కప్పి ఉంచాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. గురువారం ఆయన లచ్చపేటలోని రైస్‌మిల్లును, లక్ష్మీరావులపల్లిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వడ్లు తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, చివరి గింజ వరకు కొనుగోలు జరిగేలా సరైన కార్యాచరణ ప్రకారం అధికారులు పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు వరి కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

ట్యాబ్‌ ఎంట్రీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ విక్టర్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్‌, తహసీల్దార్‌ సరళ, సంబంధిత శాఖల అధికారులు, మిల్‌ యజమానులు, రైతులు ఉన్నారు.

కామారెడ్డి క్రైం: జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించామని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. ఈనెల 27న వేకువజామున కురిసిన వర్షంతో రామారెడ్డి, దోమకొండ, సదాశివనగర్‌, మాచారెడ్డి మండలాల పరిధిలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయని పేర్కొన్నారు. మొత్తం 1,064 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వర్షం ప్రభావానికి గురైందని అధికారులు గుర్తించి, బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు తరలించారని వివరించారు. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 914.41 కోట్ల విలువైన 3,82,760 మెట్రిక్‌ టన్నుల వడ్లను సేకరించామని, 3,27,996 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.783.57 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. 86 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement