ఎల్లారెడ్డి: కాంటా చేసిన ధాన్యం బస్తాలను వెంటనే తరలించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచించారు. మండలంలోని హాజీపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి, రైతుల సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు కావస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ధాన్యం కాంటాలు కాలేదన్నారు. కాంటా అయిన సంచులు తరలించేందుకు లారీల కొరత ఉన్నదని, దీనిని సత్వరమే అధికారులు పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ముదాం సాయిలు, జలందర్‌రెడ్డి, నర్సింలు తదితరులున్నారు.


