సాక్షి నెట్‌వర్క్: జిల్లావ్యాప్తంగా గురువారం బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండలాలు, గ్రామాల్లోని ఈద్గాల వద్ద సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే ప్రత్యేకంగా చేసిన శీర్‌ఖుర్మా(సేమియా) బంధుమిత్రులకు పంచిపెట్టారు. బాన్సువాడలోని ఈద్గా వద్ద ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌లు ముస్లింలకు ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీకి భిక్కనూరు, బీబీపేటతోపాలు పలు మండలాల కాంగ్రెస్ నేతలు కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తలిపారు. అవాంఛనీయ ఘటనల చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన బక్రీద్ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని, మాట్లాడారు. బక్రీద్ పండుగ త్యాగానికి, భక్తికి ప్రతీక అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్పీ రాజేష్‌చంద్ర, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ గిరిలు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, అధికారులు ప్రభుత్వ సలహాదారుకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు షబ్బీర్‌అలీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
కామారెడ్డిలో షబ్బీర్ అలీకి శుభాకాంక్షలు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు.. బాన్సువాడలో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్న పోచారం, కాసుల ..


