కెనాల్‌లో పడి ఒకరి మృతి
నిజామాబాద్ అర్బన్:నాగారం ప్రాంతంలోని నిజాంసాగర్ కెనాల్‌లో పడి ఒక రు మృతి చెందారు. సాయినగర్‌కాలనీ–2కు చెందిన జితేందర్(48) గత రెండు రోజుల కిందట అదృశ్యమయ్యాడు. గురువారం నిజాంసాగర్ కెనాల్‌లో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం అందించగా పోలీసులు ఘ టనాస్థలానికి చేరుకుని బయటికి తీయించారు. మృతుడిని జితేందర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి ప్రాంతంలో రైలు పట్టాలపై గుర్తు వ్యక్తి మృతదేహం లభించిందని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ హన్మాండ్లు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి కరీంనగర్ నుంచి వస్తున్న రైలు కింద పడి సదరు వ్యక్తి ఆత్మహత్యకు చేసుకుని ఉంటాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే ఎస్సై (87126 58591)కి సమాచారం అందించాలని కోరారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో జింకలపై కుక్కల దాడులు కొనసాగుతున్నా యి. ఇటీవల ఓ జింక పిల్లను రైతులు కాపాడడగా, తాజాగా గురువారం చుక్కల జింకను కుక్కలు వెంబడించగా అది తప్పించుకొని జీజీ నడ్కుడ గ్రామంలోకి వచ్చింది. గాయాలపాలైన జింకను స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సర్పంచ్ బట్టు సంజీవ్‌రాజ్ వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. డిప్యూటీ ఎఫ్‌ఆర్వో సుధాకర్, పశువైద్యాధికారి ధర్మాజీ గ్రామ పంచాయతీకి చేరుకుని జింకకు వైద్యం అందించి ఆర్మూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో వదిలిపెట్టారు.
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని లారీ ఢీకొట్టిన ఘటన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్మూర్ నుంచి నందిపేట్ వైపు మట్టి కోసం వెళ్తున్న లారీ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని బలంగా ఢీకొట్డడంతో గద్దె పూర్తిగా దెబ్బతినగా, విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ పడిపోయాయి. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. ఎస్సై రజినీకాంత్ గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్లీ నిర్మింపజేస్తామని లారీ యజమాని ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది.


