సమన్వయ లోపమే కారణమా?
పంట చేతికి వచ్చి నెల గడుస్తున్నా కొనుగోళ్లు ముందుకు సాగకపోవడంతో జిల్లాలో రైతులు ఆగమాగం అవుతున్నారు. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నా ఇప్పటికీ వడ్ల సేకరణ పూర్తికాలేదు. మక్కలు, జొన్నలదీ అదే పరిస్థితి. మరోవైపు మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం పలుచోట్ల భారీ వర్షం కురియడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – కామారెడ్డి క్రైం
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌లో రైతులు 2,57,785 ఎకరాల్లో వరి సాగుచేశారు. 1,50,470 ఎకరాల్లో దొడ్డు, 1,07,315 ఎకరాల్లో సన్న రకాలు పండించారు. మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చ ని, ఇందులో కొనుగోలు కేంద్రాలకు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వస్తాయని అంచనా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి ఆలస్యంగా కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించారు. దీంతో కొద్ది సమయం తేడాలోనే వరి, మక్కలు, జొన్నలు కేంద్రాలకు వచ్చాయి. అధికార యంత్రాంగం వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినా ఇప్పటికీ సేకరణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఖరీఫ్ ముంగిటకు వచ్చినా ఇప్పటివరకు 3.78 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారు. కొనుగోళ్లలో జాప్యంతో పలువురు రైతులు వ్యాపారులకు అమ్ముకున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో సేకరణ పూర్తయ్యింది. ఎల్లారెడ్డి, కామారెడ్డి డివిజన్‌ల పరిధిలో మరో 40 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
తూకాల్లో జాప్యం..
హామాలీల కొరతతో తూకాల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పెరుకుపోయి కాంటాలు నిలిచిపోయాయి. మక్క, జొన్నల కొనుగోళ్లలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. మక్కల కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడంతో ఇప్పటివరకు సగం కూడా సేకరించలేదు. జొన్న కాంటా మాత్రం ప్రారంభ దశలోనే ఉంది. నెల క్రితమే జొన్న కోతలు పూర్తయి కేంద్రాలకు తీసుకువచ్చినా.. నాలుగైదు రోజుల క్రితమై తూకాలు మొదలయ్యాయి. పెద్దమొత్తంలో మక్కలు, జొన్నలు ఇంకా కేంద్రాల్లోనే ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రానికి జొన్నలు తీసుకువచ్చి నెల రోజులైంది. ఇంకా కాంటా కాలేదు. రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తెల్లారగానే వాసన వస్తున్నాయి. వేగంగా కొనుగోళ్లు చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. తడిసిన జొన్నలను కొనుగోలు చేయాలి.
– బామన్ బంతీలాల్, రైతు, పెద్దకొడప్‌గల్
రైతులు ఆందోళనకు గురికావొద్దు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి నేరుగా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లయ్
కార్పొరేషన్, కామారెడ్డి
వరి ధాన్యం తరలింపునకు లారీలు రావడం లేదని బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డిలో రైతులు రాస్తారోకో చేశారు. తూకాలను వేగవంతం చేయాలంటూ నాగిరెడ్డిపేట మండలంలోని కన్నారెడ్డిగేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్‌లో తడిసిన ధాన్యం బస్తాలతో రైతులు రోడ్డెక్కారు. ఇలా రోజూ ఎక్కడోచోట రైతులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ సీజన్‌లో వరి, మక్క, జొన్నల కొనుగోళ్లకు సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే రైతులు ఆందోళనలు చేయాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా లారీల కొరత తీవ్రంగా ఉంది. కాంటా పూర్తయినా రైతులు వారాల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వచ్చింది. లారీలు సర్దుబాటు చేయడంలో అధికారుల తీరుపై చాలా గ్రామాల్లో రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడాలని కోరుతున్నారు.
ఖరీఫ్ సమీపించినా
జిల్లాలో పూర్తికాని వడ్ల సేకరణ
మక్కలు, జొన్నలదీ అదే పరిస్థితి
లారీలు రాక ముందుకు
సాగని కొనుగోళ్ల ప్రక్రియ
అకాల వర్షానికి ధాన్యం
తడవడంతో రైతుల్లో ఆందోళన


