భారీ వర్షం.. తడిసిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షం.. తడిసిన ధాన్యం

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

భారీ వర్షం.. తడిసిన ధాన్యం

చుక్కాపూర్‌లో..

కామారెడ్డి టౌన్‌/మాచారెడ్డి/దోమకొండ/ఎల్లారెడ్డిరూరల్‌/: జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌, లింగాపూర్‌తో పాటు కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, బీబీపేట్‌, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి మండలాల్లో వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు తడిసిపోయాయి. తాడ్వాయి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న కొట్టుకుపోయాయి. లింగాపూర్‌లో వరి కుప్పలు, ధాన్యం నింపిన సంచులు తడిసిపోయాయి. తోటల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు బలమైన గాలులకు నేలరాలాయి.

దోమకొండలో..

దోమకొండ మండలంలో రైతులు ధాన్యం కుప్పలపై కవర్లు కప్పినప్పటికి భారీ వర్షానికి కొంత ధాన్యం తడిసిపోయింది. కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిసిపోయాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు కాస్త ఊరట చెందారు.

ఎల్లారెడ్డిలో..

ఎల్లారెడ్డి మండలంలో బుధవారం వేకువజామున వర్షం కురవడంతో కాంటా చేసిన ధాన్యం బస్తాలు తడిశాయి. ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీ, గండిమాసానిపేట, వెల్లుట్ల ధాన్యం కొనగోలు కేంద్రాలలో ధాన్యం కుప్పల మధ్య వర్షం నీరు నిలిచింది. గండిమాసానిపేట, హాజీపూర్‌లో కాంటా చేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.

సదాశివనగర్‌లో..

సదాశివనగర్‌, అడ్లూర్‌ ఎల్లారెడ్డి, ధర్మారావ్‌పేట్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు తూకం చేసిన వడ్లబస్తాలు తడిసి ముద్దయ్యాయి.

మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్‌లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చేశారు. అదనపు కలెక్టర్‌ విక్టర్‌ తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను సముదాయించారు. రెండు లారీలను రప్పించి తడిసిన వడ్లను రైస్‌మిల్లులకు పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement