కామారెడ్డి క్రైం: జిల్లాలో 35 మంది హోంగార్డుల బదిలీల ప్రక్రియను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో 32 మంది నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వారు ఉండగా మరో ముగ్గురు కామారెడ్డి జిల్లాలో పనిచేస్తూ ఒకేచోట మూడేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్నవారు ఉన్నారని ఎస్పీ తెలిపారు. విల్లింగ్, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, రికార్డులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా పోస్టింగ్‌లను కేటాయించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేసి హైదరాబాద్ వైపు నుంచి మహారాష్ట్ర వైపు రైలులో అక్రమంగా తరలిస్తున్న 48.77 కిలోల గంజాయిని కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. సంబల్‌పూర్– పుణే ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం సాయంత్రం కామారెడ్డి రైలే్‌వ్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వచ్చింది. ఆ సమయంలో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టి పుణెకు చెందిన రోహిత్ సనీ గోర్‌ఖే అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ బుధవారం తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 24 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో రైల్వే సీఐ నర్సింలు, ఎస్సై సుబ్బారెడ్డి, ఎకై ్సజ్ ఎస్సై విక్రం కుమార్, సిబ్బంది పాల్గొన్నారన్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ కళాశాలల్లో చదువుతున్న అన్ని కులాల అభ్యర్థులనుంచి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్‌షిప్‌ల కోసం ఈనెల 31లోగా అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు సమాచారం ఇచ్చి దరఖాస్తు చేసే విధంగా చూడాలని ఆయా కళాశాలల అధికారులను కోరారు.
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా ఎ.పాండు నియమితులయ్యారు. ఆయన నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆర్డీవో క్యాడర్‌కు పదోన్నతి పొందిన ఆయనను కామారెడ్డి డీఆర్వోగా నియమించారు. ఇక్కడ డీఆర్వోగా పనిచేసిన మధుమోహన్ ఇటీవలే బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
బాన్సువాడ రూరల్: యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కోఇన్‌చార్జి రోషిణి జైస్వాల్ సూచించారు. బుధవారం బాన్సువాడలో యువజన కాంగ్రెస్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోషిణి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసి యువజన కాంగ్రెస్‌కు బలమైన పునాది వేయాలన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అభిషేక్, నాయకులు అబ్బు, సాజిద్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.


