● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: వర్షాలతో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం బస్తాలను వేగంగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ఉగ్రవాయిలోని రైస్‌మిల్లును సందర్శించారు. ధాన్యం నిల్వలు, రవాణా, మిల్లింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. రోజు కనీసం 15 లారీల ధాన్యం దించుకోవాలని మిల్లర్‌ను ఆదేశించారు. అనంతరం శాబ్దిపూర్‌లోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా జిల్లాలో సుమారుగా 1,100 మెట్రిక్ టన్నుల వడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,78,000 మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణ పూర్తయ్యిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నీరు నిల్వ ఉండకుండా కందకాలు తీయాలన్నారు. ధాన్యం కుప్పలను టార్పాలిన్‌లతో కప్పి ఉంచాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విక్టర్, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
అడ్లూర్ ఎల్లారెడ్డిలో..
సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రాని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ సత్యనారాయణ తదితరులున్నారు.


