ఇప్పటికే ఎస్–12 పెద్దపులిపై విషప్రయోగం అనుమానంతో కామారెడ్డి జిల్లాలో పలువురిపై కేసులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రెండు నెలల క్రితం నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లా ల అటవీ సరిహద్దుల్లో సంచరించిన జే–1 పెద్దపులి జాడ లేకుండా పోయింది. నెల రోజులుగా కదలికలు లేకపోవడంతో అటవీ శాఖ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఈ జే–1 పెద్దపులి వేటగాళ్ల చేతిలో మరణించిందా? మరెక్కడికైనా వెళ్లిందా? అన్నది తేలక నాలుగు జిల్లాల అటవీ అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
కమ్మర్‌పల్లి రేంజ్‌లో గట్టుపొడిచిన వాగు అటవీ సమీపంలో కొన్ని రోజులు సేదతీరిన జే–1 పెద్దపులి జగిత్యాల–సిరిసిల్ల సరిహద్దు అడవిలోకి వెళ్లి ఆవుల ను, జంతువులను వేటాడింది. చివరిసారిగా కామా రెడ్డి అటవీ ప్రాంతంలో కనిపించింది. ఏప్రిల్ రెండోవారం నుంచి దాని కదలికలు కనిపించలేదు. నాలుగు జిల్లాల అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లోనూ ఆనవాళ్లు కనిపించలేదు. పచ్చిక బయళ్లు, నీటి కుంటల వద్ద కూడా జే–1 పులి పాదముద్రలు కనిపించలేదు. ఇదిలా ఉండగా నెల రోజులు దాటిపోయినా కూడా పులి ఎక్కడ కూడా వేటాడిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. దీంతో వేటగాళ్లు పెద్దపులిని చంపి గోర్లు, చర్మాన్ని తీసుకుని ఎక్కడో పూడ్చి పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా పులి అడవుల్లో మరింత లోపలికి వెళ్లి ఉండొచ్చనీ భావిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో అటవీ శాఖ అధికారులు నిజామాబాద్–జగిత్యాల జిల్లా అటవీ సరిహద్దుల్లో పులి ఆనవాళ్ల కోసం షిఫ్ట్‌లవారీగా అన్వేషిస్తున్నారు. కమ్మర్‌పల్లి రేంజ్‌లో కోనాపూర్ సెక్షన్ పరిధిలో కేసీ తండా, వాసన్ గుట్ట పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. అనుమానిత వేటగాళ్లపై నిఘా పెట్టడమే కాకుండా వాళ్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయినప్పటికీ పెద్దపులికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. జగిత్యాల జిల్లా సరిహద్దుల్లో చింతకుంట బీట్‌లో ఒక చోట ఇనుప తీగతో ఏర్పాటు చేసిన కంచెను కనిపెట్టిన అటవీ అధికారులు దాన్ని తొలగించారు.
ఎస్–12 పై ఇప్పటికీ కరువైన స్పష్టత
తాజాగా జే–1 పులి కోసం
నిజామాబాద్–జగిత్యాల జిల్లాల్లో
సెర్చ్ ఆపరేషన్
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వద్ద కనిపించింది జే–1 పులేనా.. కాదా? స్పష్టత కరువు
విషప్రయోగం జరిగిందా?
2025 జూలైలో కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన ఎస్–12 అనే పెద్దపులిపై విష ప్రయోగం జరిగిన ఘటన కలకలం రేపింది. మాచారెడ్డి రేంజ్ పరిధిలో పెద్దపులి ఓ అవును చంపగా, పులి మళ్లీ ఆవు మాసం తినడానికి వస్తుందనే ఆలోచనతో కొందరు ఆవు కళేబరంపై విషం చల్లారు. అధికారులు విషప్రయోగం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ పులి బతికే ఉందా, మరణించిందా అనేది మిస్టరీగానే ఉంది. ఇప్పుడు కూడా కామారెడ్డి అటవీ సరిహద్దులోకి వచ్చి న జే–1 కనిపించకపోవడంపైనా అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వద్ద కనిపించింది జే–1 పులేనా కాదా అనేదానిపైనా స్పష్టత లేదు.


