అప్పట్లో వరి వేస్తే ఉరే అన్నారు..
రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదు
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకోవాలి
డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
కామారెడ్డి: తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టల్ ప్యాలెస్‌లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించారు.
నూతన కమిటీ సభ్యులు, మండలాల అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేసి, వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి మొదలుకొని సన్నబియ్యం పంపిణీ వరకు తెలంగాణలో అమలువుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు.
దేశానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శమన్నారు. గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రాష్ట్రానికి రూ. 8 లక్షల కోట్ల అప్పులను మిగిల్చిందన్నారు. అంతటి ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
అప్పట్లో వరి వేస్తే ఉరే అన్నారు..
వరి వేస్తే ఉరే అని గతంలో రైతులను భయభ్రాంతులకు గురిచేసిన విషయాన్ని బీఆర్‌ఎస్ నాయకులు మర్చిపోయారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. కల్లాల మీద రైతులు ప్రాణాలు విడిచిన దుస్థితి గత ప్రభుత్వంలో చూశామన్నారు. కేంద్ర ప్రభుత్వం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొంటామని కొర్రీలు పెడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు.
పీహెచ్‌సీల నుంచి గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల వరకు వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్, చైర్మన్‌లు ఇప్ప ఉమారాణి, సీమా షెట్కార్, పద్మ శ్రీకాంత్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


