వీధి కుక్కల స్వైర విహారం | - | Sakshi
Sakshi News home page

వీధి కుక్కల స్వైర విహారం

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

వీధి కుక్కల స్వైర విహారం

జనగామలో..

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా మంగళవారం పలువురిపై దాడి చేశాయి. బీబీపేటలో ఇద్దరు చిన్నారులపై దాడి చేసి ఒకరిని తీవ్రంగా గాయపరచగా.. సరంపల్లిలో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. వివరాలిలా ఉన్నాయి.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లిలో ఓ వీధి కుక్క మంగళవారం పలువురిపై దాడి చేసింది. వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న గుడిసె లక్ష్మి, పోలు గంగయ్య, పోలు నరేశ్‌లతో పాటు పదేళ్ల బాలుడిని తీవ్రంగా గాయపరిచింది. కనిపించినవారిపైకి దూసుకురావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు కాలనీలో రెండు లేగ దూడలపై దాడి చేసి చంపినట్లు ఆరో వార్డు కౌన్సిలర్‌ నిట్టు గంగాధర్‌ తెలిపారు. కొన్ని రోజులుగా పట్టణ శివారు ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, ఇప్పుడు ఏకంగా మనుషులు, పశువులపై దాడులకు తెగబడుతుండడంతో కాలనీవాసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సరంపల్లి, బీబీపేటలలో

పలువురిపై దాడి

ఐదుగురికి తీవ్ర గాయాలు

రెండు లేగ దూడలను కొరికి

చంపిన గ్రామసింహం

భయాందోళనలో ప్రజలు

బీబీపేట: వీధి కుక్క దాడి చేసిన ఘటనలో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడగా.. మరో చిన్నారికి స్వల్ప గాయా లయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చాకలి రాజశేఖర్‌ కూతురు సాన్వి ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. చిన్నారి కన్ను కింది భాగంలో, పెదవులపై తీవ్రగాయాలయ్యాయి. అదే కుక్క కొద్దిదూరంలో ఆడుకుంటున్న పాత గంగరాజు కూతురు రుద్వికపైనా దాడి చేసి గాయపర్చింది. ఇద్దరిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన రుద్వికకు చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్ర గాయాలపాలైన సాన్విని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement