ఇకనైనా ప్రణాళికలు మారేనా..
శిలాఫలకం పడకుండానే
నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనికి సంబంధించిన శిలాఫలకం పడకుండానే వంద రోజులు గడిచిపోయాయి. నూతన పాలకవర్గాలు వచ్చినప్పటికీ నిధులు లేక నిస్తేజంగా మారిన పట్టణాల్లో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కొత్తగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన జిల్లాలోని కామారెడ్డితోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో నూతన పాలకమండళ్లు ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించాయి. అయితే తమ సమస్యలు తీరుతాయని, పట్టణాలు ప్రగతి పథంలో పయనిస్తాయని ఆశించిన ప్రజలకు ఈ వంద రోజుల కాలంలో నిరాశే ఎదురైంది. నిధుల కొరత సాకుతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ‘కొత్త కౌన్సిల్.. పాత సమస్యలు’ అన్న చందంగా బల్దియా పాలన సాగుతోంది. నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాలకవర్గాలు ఉన్నాయి. కామారెడ్డి బల్దియా పరిధిలో 49 వార్డులు, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డిలో బిచ్కుందలో 12 చొప్పున వార్డులు ఉన్నాయి.
కొత్త కౌన్సిల్‌లు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ కారణంగా వంద రోజుల్లో పాలకులు అభివృద్ధిలో తమదైన ప్రత్యేకత చూపలేకపోయారు. వార్డుల్లో సమస్యలపై ప్రజలు వారిని నిలదీస్తున్నారు. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం రావాల్సిన గ్రాంట్లు సకాలంలో అందకపోవడం, స్థానికంగా ఆదాయ వనరులు పెరగకపోవడంతో మున్సిపాలిటీల ఖజానా వెలవెలబోతోంది. గతంలో మంజూరైన పనులకు సైతం బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు మున్సిపల్ సిబ్బంది జీతాలు, అత్యవసర నిర్వహణ ఖర్చులకే నిధులు సరిపోతుండటంతో కొత్తగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనికి కూడా రూపకల్పన చేయలేని పరిస్థితి నెలకొంది.
ఎల్లారెడ్డిలో..
ఇక్కడ రూ.2 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి. పట్టణంలో ఇంకా సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధిదీపాలు, కల్వర్టులు, అంతర్గత రహదారుల వంటి ఎన్నో పనులు చేపట్టాల్సి ఉంది.
బిచ్కుందలో..
నూతనంగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీలో వంద రోజుల్లో ఒక్కటంటే ఒక్క శంకుస్థాపన గానీ, ప్రారంభోత్సవం గానీ జరగలేదు. డ్రెయినేజీ, రోడ్లు, వీధిలైట్లు, అక్రమ కబ్జాలు, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వార్డు ఆఫీసర్లు లేరు. అధికారులు, నిధుల కొరత కారణంగా అభివృద్ధి కుంటుపడగా, ప్రజలు పాలకవర్గాన్ని నిలదీస్తున్నారు.
నూతన పాలకవర్గాలు నిధులు లేవని చేతులు ముడుచుకోకుండా, ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలని ఆయా పట్టణాల ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రెయినేజీలు, రహదారుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఇప్పటికై నా ప్రజా సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికలతో అభివృద్ధికి బాటలు వేయాలని అంటున్నారు.
మున్సిపల్ పాలకవర్గాలకు
నేటితో వంద రోజులు పూర్తి
నిధులు లేకపోవడంతో నిస్తేజం
నూతన పనులకు
శంకుస్థాపన ఊసేలేదు
పరిష్కారానికి నోచుకోని
ప్రజా సమస్యలు


