కామారెడ్డి టౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నెంబర్ బోర్డును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ, సాధికారిత, సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలకు తక్షణ సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్ కార్యాలయాలు, కలెక్టరేట్‌తోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా సాధికారిత కేంద్రం హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నెంబర్ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సులభంగా కనిపించే ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, అత్యవసర సహాయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నేడు ‘దోస్త్’ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్
తెయూ(డిచ్‌పల్లి): దోస్త్ కోర్సులలో స్పెషల్ కేటగిరి రెండో విడతలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు (పీహెచ్‌సీ/ సీఏపీ/ ఎన్‌సీసీ / స్పోర్ట్స్ /ఎక్స్‌ట్రా కరికులమ్ ఆక్టివిటీస్) ఈ నెల 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.


