భీమ్‌గల్‌ యువకుడి నూతన ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

భీమ్‌గల్‌ యువకుడి నూతన ఆవిష్కరణ

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

100 డిగ్రీల వేడితో ఆహారం

తయారయ్యే ‘వాక్యూమ్‌ ఫ్రైయర్‌’ తయారీ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని భీమ్‌గల్‌ మండల కేంద్రానికి చెందిన డాక్టర్‌ ప్రణీత్‌ జువ్వి తక్కువ నూనెతో ఎక్కువ ఆరోగ్యం ఎలా అనే ఆలోచనలతో పరిశోధనలు చేసి ‘వాక్యూమ్‌ ఫ్రైయర్‌’ అనే పరికరాన్ని తయారు చేశారు. దానికి పేటెంట్‌ తీసుకున్నారు. వాక్యూమ్‌ ఫ్రైయింగ్‌ పరికరం ద్వారా ఆహారం తక్కువ ఒత్తిడి 100 డిగ్రీల నుంచి 120 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వేడి అవుతుంది. వాక్యూమ్‌ కారణంగా ఆహారంలో ఉన్న నీరు తక్కువ ఉష్ణోగ్రతలోనే త్వరగా ఆవిరై బయటకు వస్తుంది. కానీ ఆ ఖాళీ స్థానాల్లోకి నూనె ఎక్కువగా చొరబడదు. దీంతో ఆహారంలో నూనె శాతం గణనీయంగా తగ్గి, తక్కువ కొవ్వుతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత కారణంగా అక్రిలమైడ్‌ వంటి హానికర రసాయనాల ఏర్పాటును తగ్గించవచ్చు. ఈ విధానంలో తయారైన ఆహారంలో సహజ రంగు, రుచి, వాసన, పోషక విలువలను ఎక్కువగా నిల్వ ఉంచుతుంది. ఇక పండ్లు, కూరగాయలు, చిప్స్‌ తయారీలో వాక్యూమ్‌ ఫ్రైయర్‌ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ సాంకేతికతలో ఉపయోగించే యంత్రాలు ఖరీదైనవి కావడం, నిర్వహణ కొంత క్లిష్టంగా ఉండడం గమనార్హం. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లోని ఇంఫాల్‌ సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న ప్రణీత్‌ ఫుడ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఇంటర్‌ వరకు నిజామాబాద్‌లో చదివిన ప్రణీత్‌ బాపట్లలో ఫుడ్‌ టెక్నాలజీలో బీటెక్‌, పంజాబ్‌లో ఎంటెక్‌, మైసూరులోని ఫుడ్‌ టెక్నాలజీ సెంట్రల్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు. తరువాత డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌)లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహకారంతోనూ పరిశోధనలు చేశారు.

150 నుంచి 200 డిగ్రీల్లో వేడి చేయడంతో అనారోగ్యం..

‘‘ఆహారాన్ని వేడి నూనెలో వేయించడం సాధారణ విధానం. ఈ విధానంలో ఆహారాన్ని పూర్తిగా నూనెలో ముంచి 150 డిగ్రీల నుంచి 200 డిగ్రీల వరకు ఉండే అధిక ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు. దీంతో ఆహారంలో ఉన్న నీరు ఆవిరై బయటకు వెళ్లిపోయి, ఆ ఖాళీ స్థానాల్లోకి నూనె చొరబడుతుంది. దీంతో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇలాంటి ఆహారాన్ని తరచుగా తీసుకుంటే బరువు పెరగడం, గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అదనంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద అక్రిలమైడ్‌ వంటి హానికర రసాయనాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకే నూనె ను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల నూనెలో టోటల్‌ పోలార్‌ మెటీరియ ల్స్‌, పెరాక్సైడ్‌ విలువ పెరుగుతూ నూనె నాణ్యత తగ్గిపోతుంది. ఆక్సిడేషన్‌ పెరిగి విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా ఆహారం రుచి, వాసన మారడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రమాదాలు కూడా పెరుగుతాయి’’ అని వాక్యూమ్‌ ఫ్రైయర్‌ తయారీదారు ప్రణీత్‌ పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement