● సమ్మర్ క్యాంపులో విద్యార్థుల సందడి
● డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో
శిక్షణ పొందుతున్న చిన్నారులు
ఆర్మూర్ టౌన్ : మామూలు రోజుల్లో సెల్ ఫోన్ దొరికితే చాలు..పిల్లలు పట్టువిడువరు. ఇక వేసవి సెలవుల్లో అయితే.. సెల్ ఫోన్, టీవీ తదితర వాటికి అతుక్కుపోతారు. ఈ వేసవి సెలవులు మాత్రం వినూత్నంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలతోపాటు ప్రయివేటు సమ్మర్ క్యాంపులు సైతం విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబిహనుమాన్ ఆలయ ఆవరణలో గల పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మోడల్ స్కూల్, కస్తూర్బా, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు మొత్తం 90 మంది రోజూ హాజరవుతున్నట్లు హెచ్‌ఎం వనజారెడ్డి తెలిపారు. డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సంగీతం, యోగా తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వేసవి సెలవులను పిల్లలు వృథా చేయకుండా, ఇంట్లో ఉండి సెల్ ఫోన్ పట్టకుండా శిక్షణ పొందడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో కొత్త హస్తకళలు నేర్చుకోవడం ఆనందంగా ఉంది. మా చేతులతో తయారు చేసిన బొమ్మలను ఇంటికి తీసుకెళ్లినప్పుడు అందరూ అభినందించారు. డ్రాయింగ్ కూడా చక్కగా నేర్పుతున్నారు.
– విహాన్, ఆర్మూర్
డ్రాయింగ్ క్లాస్ చాలా ఇష్టం. కొత్త రంగులను ఉపయోగించి చిత్రా లెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు చాలా రకాల డ్రాయింగ్ మెళకువలను నేర్పిస్తూ, మాతో చిత్రాలు వేయిస్తున్నారు.
– నిత్యశ్రీ, 8వ తరగతి, బాలికల పాఠశాల,ఆర్మూర్
ప్రతిరోజు ఉదయం యోగా చేయడంతో చైతన్యం పెరిగింది. దీంతో చదువుకునే శక్తి కూడా మెరుగుపడింది. సంగీతం క్లాస్‌లో కొత్త పాటలు నేర్చుకున్నాను.
– అఖిల,7వ తరగతి మోడల్ స్కూల్, పెర్కిట్
పల్లెటూరి సంప్రదాయక గోళీలాట


