మాక్లూర్: మండలంలోని కొత్తపల్లి శివారులో కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల వద్ద శనివారం ఘోరం జరిగింది. కూలీలు తవ్విన మట్టిని ట్రాక్టర్‌లో మరో చోటికి చేర్చి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బొల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ రెడ్డివోని శ్రీధర్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌ను ఉపాధి పనులకు నడుపుతున్నాడు. కూలీలు తవ్విన మట్టిని ట్రాక్టర్‌లో తన పొలానికి తరలించి ఖాళీ అయిన తరువాత డ్రైవర్ శ్రీధర్ ద్వారా ట్రాక్టర్‌ను తిరిగి పంపించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజిన్ బొల్తాపడింది. దాని కింద పడిన శ్రీధర్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలే దుబాయి నుంచి తిరిగి వచ్చిన శ్రీధర్ ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మృతుడి తండ్రి పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ ..
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చంద్రశేఖర్ కాలనీకి చెందిన కందగట్ల వెంకటేశ్ (52) నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాపిల్లలు ఉద్యోగరీత్య హైదరాబాద్ ఉంటుండగా, గత కొంతకాలంగా వెంకటేశ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి కింది పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న గౌరయ్య శనివారం ఉదయం వెంకటేశ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని పరిశీలించగా, వెంకటేశ్ తన బెడ్ రూమ్‌లోని మంచంపై విగత జీవిగా కనిపించాడు. మృతదేహం ఉబ్బిపోయి కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని మృతుడు వెంకటేశ్ భార్య పద్మావతి పోలీసులకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కొత్తపేట్‌లో మరో వ్యక్తి..
నిజామాబద్ రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పబ్బ రవిగౌడ్ (40)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి వచ్చిన రవిగౌడ్ భార్యాపిల్లలతో కలసి కొత్తపేట్‌లో నివసిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న రవిగౌడ్ భార్య ఈనెల 14వ తేదీ నుంచి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పిల్లలు సైతం ఆమె వద్ద ఉండిపోయారు. కొత్తపేటలోని ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా రవి మృతి చెంది ఉన్నాడు. మృదేహం కుళ్లిపోయింది. మృతుడి తమ్ముడు పబ్బ అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


