నిబంధనలను ఉల్లంఘిస్తే సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలను ఉల్లంఘిస్తే సహించేది లేదు

May 24 2026 1:51 AM | Updated on May 24 2026 1:51 AM

చట్టానికి లోబడే ఖుర్బాని ఉండాలి

పశువైద్యులు, పోలీసులు

సమన్వయంతో పని చేయాలి

పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య

రెంజల్‌(బోధన్‌): చట్ట ప్రకారం అనుమతించిన పశువులనే బక్రీద్‌ సందర్భంగా ఖుర్బాని చేయాలని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. మండలంలోని సాటాపూర్‌లో శనివారం కొనసాగిన పశువుల సంతను సీపీ ఆకస్మికంగా సందర్శించారు. పశువుల, కూరగాయల సంతలో కలియతిరిగి వ్యాపారులతో మాట్లాడారు. వాహనాల్లో పరిమితికి మించి పశువులను తరలించొద్దని వ్యాపారులు, కొనుగోలుదారులకు సూచించారు. బక్రీద్‌ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆవులు, దూడలను ఖుర్బాని ఇస్తున్నారని తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, నిషేధిత పశువులను తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంతలో జరిగిన పశువుల క్రయవిక్రయాల వివరాలను జీపీ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. పశువైద్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించిన సీపీ ఆరోగ్యంగా ఉన్న పశువులకు మాత్రమే సర్టిఫికెట్లు అందించాలని వైద్యులకు సూచించారు. కొనుగోలుదారులు పశువులను తరలిస్తున్న వాహనాలను పరిశీలించారు. పశువైద్యు లు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నా రు. శాంతియుత వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. సీపీ వెంట బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, పశువైద్య శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రోహిత్‌రెడ్డి, రెంజల్‌ ఎస్సై చంద్రమోహన్‌, రెంజల్‌, నవీపేట్‌,ఎడపల్లి మండలాల పశువైద్యాధికారులు విఠ ల్‌, నరేందర్‌, సురేశ్‌, ప్రమోద్‌ తదితరులున్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో..

బోధన్‌టౌన్‌(బోధన్‌): శాంతి భద్రతల పరిరక్షణలో, సమాజ భద్రతలో సీసీ కెమరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని సీపీ సాయి చైతన్య అన్నారు. ‘మన ఊరు – మన భద్రత – మన బాధ్యత’లో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాలను పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీపీ ప్రారంభించారు. పట్టణంలో రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను గుర్తించడానికి, చోరీ కేసులను ఛేదించడానికి, అల్లర్లు సృష్టించే వారిని గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. అడిషనల్‌ డీసీపీ శుభం ప్రకాశ్‌, ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ వెంకట నారాయణ, వైస్‌ చైర్మన్‌ ఇలియాస్‌, ఆయా పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement