కామారెడ్డి టౌన్ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలు జిల్లాలో ముగిశాయి. వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తన చాంబర్‌లో పర్యాటక బ్రాండ్ కిట్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాల విశిష్టతలను అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, మెప్మా పీడీ శ్రీధర్, అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పిట్లం: పోతిరెడ్డిపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రోహిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు ఇస్తున్న టీకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: సమష్టిగా పనిచేసి గ్రామీణాభివృద్ధిలో జిల్లాను ముందు వరసలో ఉంచాలని డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి కోరారు. శనివారం ఆయనను సంస్థ సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, జిల్లా అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, ప్రతినిధులు భాస్కర్, రాజేశ్వర్, సురేందర్‌రెడ్డి, స్వామి, నర్సింలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో యూత్ – స్పోర్ట్స్ వీక్ వేడుకలు నిర్వహించారు. గతంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో జిల్లాకు చెందిన 52 మంది ఎంపికయ్యారు. వారికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో జీఎం ఇండస్ట్రీస్ లాలు నాయక్, జిల్లా క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పిట్లం(జుక్కల్) : బుర్నాపూర్ నుంచి అల్లాపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో బుర్నాపూర్ శివారులో ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ పైపులైనుకు భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో నీరు పైకి ఎగిసిపడుతూ తాగునీరు వృథాగా పోతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పైపులైనుకు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.


