● గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్ : మక్కలు, జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మక్క, జొన్నల కొనుగోళ్లకు సంబంధించి అవసరమైన నిల్వ స్థలాల లభ్యత, కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సేకరించిన మక్కలు, జొన్నల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గడువులోపు కొనుగోళ్లను పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మార్కెట్ విలువల సవరణపై సమీక్ష
కామారెడ్డి టౌన్ : భూముల మార్కెట్ విలువల సవరణ కార్యకలాపాలపై శనివారం హైదరాబాద్ నుంచి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్, రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మార్కెట్ విలువల సవరణకు సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాల వారీగా పురోగతిని తెలుసుకున్న ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మార్కెట్ వాల్యూ అప్డేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంపుతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.


