వానాకాలమొచ్చినా కల్లాల్లోనే వడ్లు | - | Sakshi
Sakshi News home page

వానాకాలమొచ్చినా కల్లాల్లోనే వడ్లు

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

రెండు రోజుల్లో ధాన్యం తరలించాలి

లేకపోతే కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తాం

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌

బీబీపేట: యాసంగి సీజన్‌ ముగిసి వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ ఇంకా కల్లాల్లోనే వడ్లు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌. ఇలాగైతే ఎప్పుడు కొనుగోళ్లు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. శనివారం మల్కాపూర్‌లోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి కొనుగోళ్ల వివరా లు తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం మూడు చోట్ల వడ్లను పోసినప్పటికీ ఎక్కడా కొనుగోళ్లు పూర్తి కాలేదని రైతులు తెలిపారు. లారీలు రావడం లేదని, నెల రోజులుగా ఇక్కడే కాపలా కాయాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో గంప గోవర్ధన్‌ అడిషనల్‌ కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌, ట్రాన్స్‌పోర్టు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వర్షాలు పడితే కనీసం లారీలు కూడా కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తూకం వేసిన వడ్లను వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో లారీలను టోల్‌ గేట్‌ వద్దనుంచి తీసుకువచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని, ప్రస్తుతం అలాగే తీసుకురావాలని సూచించారు. సుమారు 5 వేల బస్తాల ధాన్యం నిల్వ ఉందని, పక్షం రోజులుగా లారీలు రాకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండు రోజుల్లో ధాన్యం తరలించకపోతే కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సర్పంచ్‌ నాగరాజు, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, నాయకులు రాజేశ్వరరావు, బాలమణి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement