కామారెడ్డి టౌన్ : మున్సిపల్ అధికారులు అవినీతి చేయాలనుకుంటే బదిలీ చేయించుకుని ఇక్కడినుంచి వెళ్లిపోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్, సానిటైజేషన్, ఇంజినీరింగ్, రెవెన్యూ, వాటర్ వర్క్స్ తదితర విభాగాల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగా, సక్రమంగా ఉన్న దరఖాస్తులను ఎలాంటి ఆలస్యం లేకుండా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఏదైనా పనికి ప్రజలను డబ్బులు డిమాండ్ చేసినట్లు తన దృష్టికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే బాధితులు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. రాజకీయ, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అధికారుల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. అనవసరమైన ఒత్తిళ్లకు తలొగ్గి మీ ఉద్యోగ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, చట్టానికి కట్టుబడి నిష్పక్షపాతంగా పనిచేయాలని అధికారులకు హితవు పలికారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్‌నాయక్, ఏఈ వేణుప్రసాద్, ఆర్‌వో రవిగోపాల్, టీపీవో వినిత్, మేనేజర్ రషీద్, అకౌంటెంట్ రాములు, టీపీబీఎస్ సాయి, వార్డు అఫీసర్లు పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా భవన
అనుమతులిస్తే చర్యలు తప్పవు
ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగవద్దు
క్యాంప్ ఆఫీస్‌లో మున్సిపల్
అధికారులతో ఎమ్మెల్యే కేవీఆర్


