‘ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి’

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

ఉత్తమ ప్రతిభకు నగదు రివార్డు

లింగంపేట: పోలీసులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా సేవలు అందించాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. శనివారం ఆయన లింగంపేట పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలన్నారు. పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరగాలన్నారు. మహిళల భద్రత, సైబర్‌ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రధాన రహదారులపై హాట్‌స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు గోవుల ఆక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లో పెండింగ్‌ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల గురించి ఎస్సై దీపక్‌కుమార్‌ ఆయనకు వివరించారు.

లింగంపేట పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు లక్ష్మణ్‌ను ఎస్పీ అభినందించి నగదు రివార్డును అందించారు. విధి నిర్వహణలో లక్ష్మణ్‌ ఉత్తమ ప్రతిభ చూపారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ రాజారెడ్డి, ఎస్సై దీపక్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement