● పేద విద్యార్థుల కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
మద్నూర్(జుక్కల్): పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. పనులపై సమీక్షించి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. అంతకు ముందు మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.
విద్యార్థినులతో కలెక్టర్ భోజనం
మండలంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి కలెక్టర్ సంగ్వాన్ మధ్యాహ్న బోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. వంటలు రుచికరంగా ఉంటున్నాయా అని కలెక్టర్ విద్యార్థినులను ప్రశ్నించారు. గత సంవత్సరం పాఠశాలకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ రూ.2 లక్షలు మంజూరు చేయగా, ఆ నిధులతో బోరు తవ్వకం, హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ గది నిర్మాణం పూర్తి కావడంతో వాటిని ప్రారంభించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో రాణి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.


