● జాతీయ లోక్ అదాలత్ సక్సెస్
● రూ.1.95 కోట్ల పరిహారం మంజూరు
● స్నేహపూర్వక పరిష్కారమే లోక్
అదాలత్ లక్ష్యం : జిల్లా జడ్జి వరప్రసాద్
కామారెడ్డి టౌన్ : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టుల్లో మొత్తం 8 బెంచ్‌లను ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న 4,506 కేసులను పరిష్కరించారు. క్రిమినల్, సివిల్, ప్రీలిటిగేషన్ విభాగాల్లో రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయి. క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 4,391 పరిష్కరించి రూ.73,83,390 పరిహారాన్ని బాధితులకు అందించారు. 24 సివిల్ కేసుల్లో పరిష్కారం చూపారు. మోటార్ ప్రమాద బీమా 11 కేసుల్లో రూ.కోటీ 5 వేల భారీ పరిహారాన్ని బాధితులకు అందజేశారు. 63 సైబర్ క్రైం కేసులను పరిష్కరించి రూ. 12,44,391 రికవరీ చేశారు. బ్యాంకు ప్రీలిటిగేషన్ 17 కేసుల్లో రూ. 9,65,000 సెటిల్ చేశారు. జిల్లావ్యాప్తంగా 4,506 కేసులను పరిష్కరించి, బాధితులకు మొత్తంగా రూ.1,95,97,781 పరిహారాన్ని ఖరారు చేశారు.


