ఆయకట్టుకు నిజాంసాగర్‌ భరోసా | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు నిజాంసాగర్‌ భరోసా

Mar 27 2026 9:20 AM | Updated on Mar 27 2026 9:20 AM

ఆయకట్టుకు నిజాంసాగర్‌ భరోసా

ఇప్పటికే నాలుగు విడతల్లో అందిన నీరు

మరో రెండు తడుల్లో గట్టెక్కనున్న పంటలు

ప్రాజెక్టులో 10.5 టీఎంసీల నిల్వ

నిజాంసాగర్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ కింద పంట పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులో ఇంకా పది టీఎంసీలకుపైగా నీరుండడంతో ఈసారి సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని రైతులు పేర్కొంటున్నారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద అలీసాగర్‌ రిజర్వాయర్‌ వరకు 1.5 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. మొదటి డిస్ట్రిబ్యూటరి నుంచి 49వ డిస్ట్రిబ్యూటరి వరకు నీరందుతోంది. యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు విడతలలో కలిపి 10.7 టీఎంసీల సాగునీరందించారు. మొదటి విడతలో గతేడాది డిసెంబర్‌ 8 నుంచి జనవరి 7 వరకు 3.2 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రెండో విడతలో జనవరి 12 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు 2.6 టీఎంసీలు, మూడో విడతలో ఫిబ్రవరి 9 నుంచి 24 వరకు 2.1 టీఎంసీల నీటిని అందించారు. నాలుగో విడతలో ఈనెల 4 నుంచి 21 వరకు 2.7 టీఎంసీల నీటిని వదిలారు.

నెల రోజుల్లో పంటలు చేతికి..

నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కింద బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, వర్ని, రుద్రూర్‌, కోటగిరి, నవీపేట్‌, నందిపేట, బోధన్‌ మండలాల పరిధిలో ముందస్తుగా పంటలు సాగు చేశారు. ఆయా ప్రాంతాల్లోని పంటలు నెలరోజుల్లో కోతకు రానున్నాయి. అప్పటి వరకు ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు మరో రెండు విడతల్లో సాగు నీరు అందించనున్నారు.

ఆశాజనకంగా నీరు..

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,399.12 అడుగుల (10.5 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

నిజాంసాగర్‌ ఆయకట్టు కింద కళకళలాడుతున్న వరి పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement