నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గోపాల్‌పేట ఆర్యవైశ్య కళ్యాణమండపంలో బీజేపీ మండల నాయకులు కొండ మీరాతాయి ఆధ్వర్యంలో మూడురోజులుగా నిర్వహించిన కోలలు, భజనల మండలస్థాయి పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీలలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలు కళాబృందాలు పాల్గొన్నాయి. కోలల పోటీల్లో మండలంలోని చిన్నఆత్మకూర్ జట్టు ప్రథమస్థానంలో నిలిచి రూ.5వేలు, రాఘవపల్లి జట్టు ద్వితీయస్థానంలో నిలిచి రూ.3వేలు, లింగంపల్లికలాన్ తృతీయస్థానంలో నిలిచి రూ.2వేలు, భజనపోటీల్లో మాల్తుమ్మెద జట్టు ప్రథమస్థానంలో నిలిచి రూ.5వేలు, జప్తిజాన్కంపల్లి జట్టు ద్వితీయస్థానంలో నిలిచి రూ.3 వేలు, నాగిరెడ్డిపేట జట్టు తృతీయస్థానంలో నిలిచి రూ.2వేల నగదును గెలుచుకున్నాయి. పోటీల్లో పాల్గొన్న ప్రతిజట్టుకు రూ.1,500చొప్పున అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్‌మోహన్‌రెడ్డి, నేతలు హన్మాండ్లు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట: ప్రస్తుతం సోషల్ మీడియా పట్ల విద్యార్థులందరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్సై విజయ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మైనర్లపై జరుగుతున్న నేరాలు, ప్రేమలు, మోసాలు అనే అంశంపై జిల్లా పోలీసు శాఖ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. హెచ్‌ఎం రవీంద్రారెడ్డి, ఏఎస్సై సుబ్రహ్మణ్యం, పోలీసు కళాబృందం తిరుపతి, శేషారావు, సాయిలు, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట: నర్సరీలో మొక్కలతో పాటు రోడ్డు పక్కల పెట్టినటువంటి మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని డీఆర్‌డీఏ అసిస్టెంట్ పీడీ వామనరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని నర్సరీ, మల్బరీ సాగు, ఉపాధి హామీ పనులు పరిశీలించారు. మల్బారి సాగు పట్ల రైతులు అవగాహన పెంచుకొని లాభాలు పొందాలని సూచించారు. సర్పంచ్ ఏదుళ్ల సాద్విక, ఏంపీవో అబ్బాగౌడ్, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద కోర్డు ఆవరణలో గురువారం బార్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రకాష్ పటేల్, ఉపాధ్యక్షుడిగా శివాజీ, ప్రధాన కార్యదర్శిగా మనోజ్ కుమార్, సీనియర్ న్యాయవాదులను సలహాదారులుగా ఎన్నుకున్నారు. అనంతరం న్యాయవాదులు నూతన కమిటీని సన్మానించారు. సీనియర్ న్యాయవాదులు లక్ష్మణ్‌రావు, మల్లేశం, విఠల్, విఠల్‌రావు, మహ్మద్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద(జుక్కల్): బైక్ చోరీ కేసులో నిందితుడు చౌహాన్ అర్జున్‌ను గురువారం పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు. సీతారాంపల్లికి చెందిన ఎర్రోళ్ల గంగాబోయి ఈ నెల 23న బిచ్కుందలోని సినిమా థియేటర్ వద్ద హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ పార్క్ చేశాడు. ఆ తర్వాత కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 25న బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్‌పై వచ్చిన వ్యక్తిని విచారించగా, బైక్‌ను దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. చౌహాన్ అర్జున్‌ను రాజుల్లా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరింత విచారణ చేయగా కందర్‌పల్లి, ఫత్లాపూర్, జుక్కల్, బాన్సువాడ, నాగిరెడ్డిపేట్ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడైందని ఎస్సై తెలిపారు. చాకచాక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న ఎస్సై రాజు, కానిస్టేబుల్ మహ్మద్ నదీమ్, ఉపేంద్రను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.
మాచారెడ్డి: సెల్ ఫోన్ల చోరీ కేసులో గురువారం ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. మండలంలోని అంకిరెడ్డిపల్లి తండాకు చెందిన గుగులోతు చందు గజ్యానాయక్ తండా చౌరస్తాలో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చందుకు చెందిన సెల్ దుకాణం తాళాలు పగలకొట్టి మూడు ఫోన్లు, కొంత నగదును దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం గజ్యానాయక్ తండా చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అంకిరెడ్డిపల్లి తండాకు చెందిన అజ్మీర అశోక్ అలియాస్ గణేశ్ పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అనిల్ వివరించారు.
నస్రుల్లాబాద్: రేషన్‌షాపులను బినామీలు నిర్వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి అన్నారు. గురువారం దుర్కి, సంగం గ్రామాల్లో గల రేషన్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపులో గల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కేసులు పెడతామన్నారు.
కామారెడ్డిఅర్బన్: శ్రీహరికోట ఇస్రో సందర్శనకు పట్టణ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్టు హెడ్‌మాస్టర్ గంగాకిషన్ తెలిపారు. పాఠశాల 8,9 తరగతుల విద్యార్థులు శ్రీహిత, వర్షిక, శివహాస్‌లు ఎంపిక కాగా ఈ నెల 27న(నేడు) సందర్శన బృందంలో వెళ్తున్నట్టు హెడ్‌మాస్టర్ పేర్కొన్నారు.


